ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు. మీటింగ్ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.., నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఛైర్మన్తో సమావేశం జరిగిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సుదీర్ఘ చర్చ జరిగిందని అన్నారు. సోమవారం మళ్ళీ ఇంజనీర్ల స్థాయిలో సమావేశం కొనసాగనుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అట్టహాసంగా, ఆర్భాటంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశారు.. ఎక్కువ పైసలు ఖర్చు పెడితే, ఎక్కువ కమిషన్ వస్తుందనే కక్కుర్తితో నిర్మాణం చేపట్టారని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి జలవనరుల మంత్రిత్వ శాఖ సలహాదారుడు వెదిరే శ్రీరామ్ కమిషన్ కు అఫిడవిట్ కూడా ఇచ్చారు.. లక్ష కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించారని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. కాళేశ్వరంలో ఐదేళ్ల పాటు పంప్ అయిన నీళ్ళు 65 టీఎంసీలు.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయి అన్ని పంపులు పని చేస్తే ఏడాదికి కరెంట్ ఛార్జీలే 10 వేల కోట్లు ఖర్చు కానున్నాయని అన్నారు. వడ్డీకి రూ.15 వేల కోట్లు, విద్యుత్ ఛార్జీలకు రూ.10 వేల కోట్లు ఖర్చు కానుందని తెలిపారు. మేడిగడ్డ ఫౌండేషన్ ఆరడుగులు కుంగి పోయింది.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మేడిగడ్డ ప్రాజెక్టు డ్యామేజ్ అయిందని మంత్రి తెలిపారు. భారత దేశంలో పార్లమెంట్ చట్టం ప్రకారం ఏర్పడ్డ డ్యాం సేఫ్టీ అథారిటిని స్టడీ చేయాలని కోరామని మంత్రి ఉత్తమ్ చెప్పారు.
కేటీఆర్ కామెంట్స్పై స్పందించిన మంత్రి ఉత్తమ్..
అబద్దాలు చెప్పడానికి కూడా ఒక హద్దు ఉండాలని కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ దోపిడీ విధానాలతోనే లోపాలు జరిగాయని పేర్కొన్నారు. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ అన్నారు.. వారి హయాంలోనే కూలిందని ఆరోపించారు. డ్యామ్ సేఫ్టీ అధికారులకు కేటీఆర్ కంటే ఎక్కువ పరిజ్ఞానం ఉందని భావిస్తున్నామన్నారు. నాశనం చేసిన వారే సలహాలు ఇస్తుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ల ఉచిత సలహాలు అవసరం లేదు.. సాంకేతిక కమిటీ నిపుణుల సలహాల మేరకే ముందుకు వెళతామని మంత్రి ఉత్తమ్ చెప్పారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.