Venus: మనకు తెలిసినంత వరకు ప్రస్తుతం విశ్వంలో భూమి మాత్రమే జీవజాలానికి ఇళ్లుగా ఉంది. అయితే, శాస్త్రవేత్తలు అనంత విశ్వంలో జీవానికి అనుకూలంగా ఉన్న భూమి లాంటి గ్రహం కోసం వెతుకుతూనే ఉన్నారు. మన సౌరవ్యవస్థల్లో అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండేదని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ పరిశోధన శుక్రుడి మీద జీవం ఉండే అవకాశాన్ని సూచించే విధంగా ఫాస్ఫైన్ వాయువు ఆనవాళ్లను కనుగొన్నారు. ఇది శాస్త్రవేత్తల్లో నమ్మకాన్ని పెంచుతోంది. శుక్రుడిపై ఉన్న ఫాస్ఫరస్ బేరింగ్ శిలలు ఎగువ వాతావరణంలోని నీరు, ఆమ్లాలతో చర్య జరిపి ఫాస్ఫైన్ వాయువును ఉత్పత్తి చేస్తున్నట్లుగా ఓ సిద్ధాంతం ఉంది.
ఈ వారం వేల్స్‌లోని కార్డిఫ్ యూనివర్సిటీలో రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీకి చెందిన నేషనల్ ఆస్ట్రానమీ మీటింగ్ 2023లో జేన్ గ్రీవ్స్ ప్రసంగిస్తూ శుక్రుడి వాతావరణంలో ఫాస్ఫైన్‌ని కనుగొన్నట్లు ప్రటకించారు. హవాయిలోని మౌనా కీ అబ్జర్వేటరీలోని గ్రీవ్స్ బృందం వీనస్ మేఘాలను పరిశీలించడానికి జేమ్స్ క్లార్క్ మాక్స్‌వెల్ టెలిస్కోప్ (JCMT)ని ఉపయోగించింది. శాస్త్రవేత్తల ప్రకారం భూమిపై చాలా తక్కువ స్థాయిలో ఫాస్ఫైన్ వాయువు ఉంది. ముఖ్యంగా సూక్ష్మజీవులు తక్కువ ఆక్సిజన్ స్థాయిల వద్ద జీవిస్తాయి. వాటి జీవక్రియ ప్రక్రియల ద్వారా ఫాస్ఫైన్ ఏర్పడుతుంది. ఇతర గ్రహాలపై ఉన్న ఫాస్ఫైన్ జీవాల ఉనికి ఉండేందుకు అవకాశం ఉన్న బయోసిగ్నేచర్‌గా సూచించబడుతుంది.
శుక్రుడిపై ఫాస్ఫైన్‌ని కనుగొన్నప్పటికీ జీవం ఉందని అర్థం కాదు. అయితే ఆ గ్రహంపై ఫాస్ఫైన్ ఏర్పడటానికి ఏది దారితీస్తుందో ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. భూమికి ఆవల జీవం కోసం అన్వేషించడం చాలా సంక్లిష్టతతో కూడుకున్న విషయం. దీనిపై మరింత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శుక్రుడు సౌర వ్యవస్థలోనే అంతుపట్టకుండా ఉన్నాడు. శుక్రుడి ఉపరితలం చాలా కఠినమైనది, ఉష్ణోగ్రతలు దాదాపు 900 డిగ్రీల ఫారెన్‌హీట్ (475 డిగ్రీల సెల్సియస్)కి చేరుకుంటాయి. అయితే, ఉపరితలం నుండి 30 మైళ్ల ఎత్తులో మేఘాల పొరల్లో పరిస్థితులు మితంగా ఉంటాయి. భూమిపై ఉన్న వాటిని పోలి ఉంటాయి.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.