Warangal Bhadrakali Ammavaru in Shakambari Alankarana: ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళీ అమ్మవారు ‘శాకంబరీ’ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 15 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన భద్రకాళీ శాకంబరీ నవరాత్రి ఉత్సవాల చివరి రోజైన ఆదివారం అమ్మవారు శాకంబరీగా భక్తులకు దర్శనం ఇచ్చారు. శాకంబరీ అలంకరణ, గురుపౌర్ణమి నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. తాగునీటి వసతి కల్పనతో పాటు ఉచిత అన్నదాన ప్రసాద వితరణ చేస్తున్నారు.
ప్రధాన అర్చకుడు భద్రకాళీ శేషు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 3 గంటలకు భద్రకాళీ అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పలు కూరగాయలతో శాకంబరీగా అలంకరించారు. ఆపై ప్రత్యేక పూజలు చేసి.. ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. శాకంబరీ నవరాత్రుల చివరి రోజు కావడంతో భద్రకాళీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. గురుపౌర్ణమి కావడంతో భద్రకాళీ ఆలయ ప్రాంగణంలోని సాయిబాబా దేవాలయానికి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
శాకంబరీ అలంకరణలో భాగంగా భద్రకాళీ అమ్మవారిని నాలుగు క్వింటాళ్ల పలు రకాల కూరగాయలతో అలంకరించారు. నగర ప్రముఖులతో పాటు జిల్లా నలుమూలల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్యూలైన్లు కిక్కిరిసాయి. వర్షం పడుతున్నా భద్రకాళీ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకోవడం విశేషం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా భారతి పర్యవేక్షణలో ఈవో శేషు విస్తృత ఏర్పాట్లు చేశారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.