Wayanad landslides : కేరళలోని వయనాడ్ జిల్లాలో సంభవించిన ప్రకృతి విలయం భారీ విధ్వంసాన్ని సృష్టించింది. భారీ వరదలతో కొండచరియలు విరిగిపడడంతో మాటలకందని విపత్తు సంభవించింది. దాదాపు వంద మంది ప్రాణాలు కోల్పోగా, వందల సంఖ్యలో స్థానికులు గల్లంతయ్యారు. పొట్టకూటి కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు కూడా విపత్తులో చిక్కుకుపోయారు. సుమారు 600 మంది వలస కార్మికులు జాడ తెలియడం లేదు.
Wayanad landslides
తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పనిచేసేందుకు పశ్చిమ బెంగాల్, అస్సాం నుంచి వచ్చిన కార్మికులు ముండకై ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరంతా హారిసన్ మలయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నారు. తమ కంపెనీలో పనిచేసే కార్మికులను ఇప్పటివరకు సంప్రదించలేకపోయామని కంపెనీ జనరల్ మేనేజర్ బెనిల్ జోన్స్ వెల్లడించడంతో ఆందోళన రేగుతోంది. మొబైల్ ఫోన్ నెట్‌వర్క్ కూడా పనిచేయకపోవడంతో కార్మికుల జాడ తెలియరాలేదు. ముండకై ప్రాంతంలోని నాలుగు వీధుల్లో 65 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కార్మికులు నివాసం ఉండే ప్రాంతాలపై కొండ చరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో కార్మికులు ఏమాయ్యారోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
నదిలో తేలియాడుతున్న మృతదేహాలు
Wayanad landslides కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు మలప్పురం చలియార్ నదిలో తేలియాడుతున్నాయి. కొండ చరియలు విరిగిపడ్డ స్థలానికి కిలోమీటర్ల దూరంలో శరీర భాగాలు లేకుండా మృతదేహాలు లభ్యమవుతుండడం దిగ్బ్రాంతి కలిగిస్తోంది. శరీర భాగాలు లేకుండా మూడేళ్ల పాప మృతదేహం దొరకడం అక్కడున్నవారిని తీవ్రంగా కలచివేసింది.
సహాయక చర్యలు ముమ్మరం
Wayanad landslides కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. బాధితులకు సాయం చేయడానికి నౌకాదళానికి చెందిన 30 మంది గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. భారత వాయుసేనకు చెందిన రెండు హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 321 మందితో కూడిన అగ్నిమాపక దళంతో పాటు 200 మంది సైనిక సిబ్బంది కూడా సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.