Jagan Deeksha ఏపీలో అధికార ఎన్డీయే కూటమి, విపక్ష వైసీపీల మధ్య పీక్స్‌కు చేరిన పొలిటికల్ ఫైట్‌లో ఢిల్లీ ట్విస్ట్ ఆసక్తికరంగా మారింది. ఏపీలో అధికార కూటమి వర్సెస్ విపక్ష వైసీపీ పంచాయితీ.. ఇక ఢిల్లీకి చేరనుంది. పార్లమెంటు సమావేశాల కోసం టీడీపీ, వైసీపీ వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలో తమ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశాయి. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై వైసీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. ఉభయ సభల్లో ఏవిధంగా వ్యవహరించాలో ఎంపీలకు సూచించారు. తాడేపల్లి నివాసంలో ఎంపీలతో సమావేశమైన జగన్.. ఢిల్లీలో తాను చేయబోయే ధర్నాపై చర్చించారు. రాష్ట్రంలో జరుగుతోన్న దాడులు, హత్యలను ఢిల్లీ వేదికగా కేంద్రం, దేశం దృష్టి తీసుకెళ్లాలన్నారు జగన్.
ఏపీలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని నిన్న వినుకొండలో ప్రెస్ మీట్లో ఆరోపించారు మాజీ సీఎం జగన్. వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, వినుకొండలో జరిగిన హత్య ఘటన దీనికి పరాకాష్ట అన్నారు. గత 45 రోజులుగా ఏపీలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలపై పార్లమెంట్‌లో గళమెత్తాలని ఎంపీలకు సూచించారు జగన్. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలంటూ తమ పార్టీ ఎంపీలను ఆయన ఆదేశించారు. ఏపీలో జరుగుతున్న హింసాకాండపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్లు కోరామని ఎంపీలకు తెలిపారు జగన్. పార్టీ తరఫున పోరాటాలు చేయకపోతే ఈ దారుణాలకు అడ్డుకట్ట పడదన్న జగన్, అసెంబ్లీ సమావేశాల్లోనూ నిరసన తెలుపుదామన్నారు.
పోరాటంతో ఏపీ సర్కార్‌పై ఒత్తిడి తీసుకురావాలని, కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు వైసీపీ అధినేత. ఇక ఈ నెల 24న బుధవారం ఢిల్లీలో తలపెట్టిన నిరసన, ధర్నా కార్యక్రమం గురించి ఎంపీలతో జగన్ చర్చించారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని యావత్ దేశం గుర్తించేలా, ఏం చేయాలన్న దానిపై సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఢిల్లీ వేదికగా దేశం మొత్తానికి తెలియజేస్తామన్నారు వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి. పార్లమెంటులో కూడా దాడుల అంశాన్ని లేవనెత్తుతామన్నారు. ఇక ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తోన్న అరాచకాలను పార్లమెంట్ దృష్టికి తీసుకొస్తామని, రాష్ట్రంలో జరుగుతోన్న హత్యాకాండను దేశం దృష్టికి తీసుకెళ్తామన్నారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. ఈ సందర్భంగా బుధవారం నాడు ఢిల్లీలో జగన్ ధర్నాతోపాటూ, నిరాహార దీక్ష చేస్తారన్నారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.