Delhi Rains దేశ రాజధానిలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నగరానికి రావాల్సిన పలు విమానాలను దారి మళ్లించినట్లు సమాచారం.
Delhi Rains
దిల్లీ: దేశ రాజధాని నగరంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీచేసింది. బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సెంట్రల్ దిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో కేవలం ఒక గంట వ్యవధిలోనే 112.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పలుచోట్ల నడుములోతు నీరు నిలిచిపోయింది. దీంతో అనేక చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దిల్లీకి రావాల్సిన పలు విమానాల దారి మళ్లించినట్లు సమాచారం. రోడ్లపైకి మోకాల్లోతు నీళ్లు రాడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు, రావూస్ అకాడమీలో ముగ్గురు సివిల్స్ విద్యార్థుల మృతికి నిరసనగా ఓల్డ్ రాజిందర్‌నగర్‌లో సివిల్స్ అభ్యర్థులు వర్షంలోనూ ఆందోళన కొనసాగిస్తున్నారు.
ఇటీవల ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మరణించిన రాజేంద్రనగర్ ప్రాంతం మరోసారి వరద నీటితో మునిగిపోయింది. ఆ ప్రాంతంలోనే అనేక కోచింగ్ సెంటర్లలోకి నీరు వచ్చిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో స్థానిక ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. అక్కడ మోకాళ్లలోతు నీరు నిలిచిపోగా.. అందులో చిక్కుకున్న వాహనాలను బయటకు తీయడంతో స్థానిక పోలీసులకు కొందరు విద్యార్థులు సహాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆమ్‌ఆద్మీ పార్టీ ఎక్స్‌లో పోస్టు చేసింది.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.