North Korea Floods ఉత్తర కొరియాను భారీ వరదలు ముంచెత్తాయి. కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున పొలాలు, ఇళ్లు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. ఇక కిమ్.. స్వయంగా విపత్తు సహాయక చర్యల్లో భాగస్వామి అయ్యారు. రెస్క్యూ సిబ్బందితో పాటు బోటులో వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మీడియాలో ప్రచారం కావడంతో వైరల్‌గా మారాయి.
North Korea Floods
ఇదిలా ఉంటే దాయాది దేశం దక్షిణ కొరియా.. విపత్కర పరిస్థితుల్లో.. ఉత్తర కొరియాకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. భీకర వరదలతో అతలాకుతలమైన ఉత్తరకొరియాకు మానవతా సాయం అందిస్తామని దక్షిణ కొరియా ప్రకటించింది. బాధితులను ఆదుకునేందుకు సహాయ సామగ్రిని అందజేస్తామని వెల్లడించింది. ఎలా సరఫరా చేయాలన్న దానిపై చర్చించేందుకు తక్షణమే స్పందించాలని ఉత్తరకొరియా రెడ్ క్రాస్ సంస్థను కోరింది. అయితే దీనిపై కిమ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఇక భారీ వర్షాల కారణంగా బుధవారం 4100 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 7,410 ఎకరాల పంటకు నష్టం వాటిల్లింది. చైనా సమీపంలోని సినాయ్జూ, యిజు పట్టణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ప్రాణ నష్టంపై కిమ్ సర్కారు ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. విపత్తు సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను కఠినంగా శిక్షించాలని కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.