ఎన్నికల విధుల్లోకి ఉపాధ్యాయులు?
ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను దూరంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టబోతున్నాయా? ఉపాధ్యాయులను ఎన్ని కల విధులకు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గతంలో విద్యాహక్కు చట్టానికి సవరణలు తెచ్చింది. టీచర్లకు ఎలాంటి బోధనేతర పనులూ అప్పగించకూడదని స్పష్టం చేసింది. తాజా పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకునేందుకు సంసిద్ధత జాబితా సిద్ధం చేయా లంటూ వైయస్సార్ జిల్లా విద్యాధికారి రాఘవరెడ్డి ఎంఈఓ లకు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్, ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మండల విద్యాధికారి-1కి ఈ మేరకు మెమో జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రిసై డింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారి, ఇతర పోలింగ్ అధికారులుగా విధులు నిర్వర్తించేందుకు ఉపాధ్యాయుల నుంచి సంసిద్ధత తీసుకోవాలని ఆ మెమోలో సూచించారు. ఈ జాబితాను ఈనెల 25లోపు పంపించాలని ఆదేశించారు.
Election Commission : జగన్ ఎత్తు చిత్తు టీచర్లకు ఎన్నికల విధులు
‘బోధన మాత్రమే చేయాలి’ అనే సాకుతో ఎన్నికల డ్యూటీ నుంచి టీచర్లను తప్పించి… తాము నియమించుకున్న సచివాలయ సిబ్బందికి అప్పగించాలని జగన్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఇది సాకు మాత్రమే ఎందుకంటే..
- జగన్ ఆశలపై నీళ్లు చల్లిన సీఈసీ
- బోధన పేరిట టీచర్లను దూరంపెట్టే వ్యూహం
- సచివాలయ ఉద్యోగులతో పోలింగ్‌కు ఎత్తు
‘బోధన మాత్రమే చేయాలి’ అనే సాకుతో ఎన్నికల డ్యూటీ నుంచి టీచర్లను తప్పించి… తాము నియమించుకున్న సచివాలయ సిబ్బందికి అప్పగించాలని జగన్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఇది సాకు మాత్రమే ఎందుకంటే.. ఎన్నికల విధులు బోధనేతర పని అనుకుంటే..అది ఐదేళ్లకు ఒకసారి మాత్రమే ఉంటుంది. కానీ, బాత్రూమ్‌ల ఫొటోలు తీయించడం, ‘నాడు- నేడు’ పనులు చేయించడం, మధ్యాహ్న భోజనం ఫొటోలు తీయడం, ఆన్‌లైన్ హాజరు లాంటి బోధనేతర పనులకు తెంపే లేదు. ఈ పనులు టీచర్లు రోజూ చేయాల్సిందే. ‘బోధనేతర’ పనులు తప్పించాలని సుదీర్ఘకాలంగా టీచర్లు పోరాడుతున్నారు. కానీ, జగన్ సర్కారు దీనికి వక్రభాష్యం చెప్పింది. అప్పటి జీవోలో ఎన్నికలు అనే మాట వాడలేదుగానీ.. అర్థం అదేనని అందరికీ అర్థమయింది. ఇప్పుడు ఏకంగా ఎన్నికల సంఘమే జోక్యంచేసుకుంది. ఉద్యోగుల, టీచర్ల వివరాలు పంపాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది.
- శాఖలవారీగా ఉద్యోగులు, టీచర్ల వివరాలివ్వండి
- కలెక్టర్లకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు
- 25లోగా టీచర్ల వివరాలు పంపాలన్న డీఈవోలు
- సీపీఎస్ రద్దు ఆందోళన తర్వాత టీచర్లపై గుర్రు
- ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేస్తారేమోనని గుబులు
- ఎన్నికల నుంచి తప్పించే రీతిలో ఆదేశాలు
- దీనిపై సీఈసీకి ఫిర్యాదులు.. సంకటంలో సర్కార్
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో ఎన్నికలు నిర్వహించి మరోసారి గద్దెనెక్కాలనుకున్న ముఖ్యమంత్రి జగన్ ఎత్తుగడలు చిత్తవుతున్నాయి. ‘బోధనేతర’ సాకుతో సార్వత్రిక ఎన్నికలకు టీచర్లను దూరంగా ఉంచాలనుకున్నా.. వారిని తిరిగి ఆ విధుల్లోకి తీసుకోకతప్పని పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగానే తమకు వ్యతిరేకంగా మారిన ఉపాధ్యాయ వ్యవస్థను తప్పించేలా జగన్ చేసిన దురాలోచనలపై ఎన్నికల సంఘం నీళ్లు చల్లింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని శాఖల వారీగా ఉద్యోగుల వివరాలు కేటగిరీలవారీగా పంపాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. టీచర్లను ఎన్నికల విధుల్లో పెట్టే ఉద్దేశం లేకపోయినా ఈసీ ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఎందుకైనా మంచిదని వారి వివరాలు సేకరించడం ప్రారంభించింది. శనివారం లోగా పాఠశాల విద్యాశాఖతోపాటు జిల్లా కలెక్టర్లకు వివరాలు ఇవ్వాలని ఎంఈవోలకు డీఈవోలు ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మోడల్ స్కూళ్లలో పనిచేసే ప్రధానోపాధ్యాయులు సహా అందరి వివరాలూ ఇవ్వాలని స్పష్టం చేశారు..
నాడు చెప్పింది ఇదీ…
గతేడాది నవంబరు 29న విద్యా హక్కు చట్టంలోని నిబంధనలకు వైసీపీ ప్రభుత్వం సవరణలు చేసింది. టీచర్లకు బోధన, విద్యా సంబంధిత అంశాలు మినహా ఎలాంటి బోధనేతర పనులు అప్పగించకూడదంటూ అప్పట్లో జీవో జారీచేసింది. ఒకవేళ ఏవైనా తప్పనిసరి పరిస్థితులు ఏర్పడి అదనపు సిబ్బంది అవసరమైతే… అన్ని శాఖల ఉద్యోగులను వినియోగించిన అనంతరం అవసరమైతే మాత్రమే టీచర్ల సేవలు వాడుకోవాలని స్పష్టంచేసింది. ఆ నిబంధనల్లో ఎక్క డా కూడా ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు పాల్గొన కూడదని పేర్కొనలేదు. కానీ, ఈ ఆదేశాలను ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జారీచేసిందనేది అందరికీ అర్థమైపోయింది.
వాస్తవం ఇదీ…
ఉద్యోగ, ఉపాధ్యాయులు జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారి ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం దెబ్బకొట్టడంతో దాదాపు అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారు. సీపీఎస్ రద్దు చేయాలనే డిమాండ్‌తో టీచర్లు విజయవాడలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. అది అప్పట్లో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చింది. జగన్ గత ఎన్నికల ముందు తాను అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటూ నమ్మబలికారు. కానీ అధికారంలోకి రాగానే కక్షసాధింపు కత్తి దూస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయుల్లోనే ఎక్కువ మంది ఉన్నారు. అధికారంలోకి రాగానే వారం లో సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికల ముందు చెప్పి జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీ తుంగలో తొక్కారు. జీపీఎస్ అంటూ ఇష్టంలేనిదాన్ని రుద్దారు. సకాలంలో జీతాలు లేవు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోగా, గట్టిగా ప్రశ్నించిన వారికి షోకాజ్ నోటీసులు పరిపాటిగా మారాయి.
దీంతో జగన్ సర్కార్‌పై ఉపాధ్యాయులు ఆగ్రహంగా ఉన్నారు. ఆ పరిణామాలను చూసిన ప్రభుత్వ పెద్దలు.. ఎప్పట్లాగే టీచర్లు ఎన్నికల విధుల్లోకి వస్తే తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకోవడం సాధ్యంకాదనే భావనకు వచ్చారు. ఈ నేపథ్యంలో విద్యా సంబంధిత వ్యవహారాలంటూ కొత్తవాదన తెరపైకి తెచ్చారు. విద్యా రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామనే నెపంతో వారికి వేరే బాధ్యతలు ఇవ్వకూడదని నిబంధనలకు సవరించారు. తద్వారా ఎన్నిక ల్లో టీచర్లు ఉండకూడదని ప్లాన్ చేశారు. వారి స్థానంలో గ్రా మ, వార్డు సచివాలయాల ఉద్యోగులను ఎన్నికలకు వాడుకోవాలని భావించింది. ఇది జగన్ సర్కారు తీసుకొచ్చిన వ్యవస్థ. కాబట్టి ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చునని ఆశించారు.
ఈసీ ఆదేశాల్లో ఏముంది?
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా తాజాగా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. జిల్లాల్లోని అన్నిశాఖల వివరాలు, కేటగిరీల వారీగా పంపాలని కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్లు ఆయాశాఖల అధికారులను అప్రమత్తం చేశారు. అన్నిశాఖల అధికారులతోపాటు ఎన్నికల సంఘం ఆదేశాలతో విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయుల వివరాలు కేటగిరీలవారీగా సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. 2024 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఉపాధ్యాయులను పీవోలుగా, ఏపీవోలుగా, ఇతర పోలింగ్ అధికారులుగా విధుల్లోకి తీసుకోవడంపై సంసిద్ధత జాబితాను సిద్ధం చేయాలంటూ ఎంఈవోలను కోరుతూ జిల్లా విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు క్యాడర్‌వైజ్‌గా డిసెంబరు 25లోపు జిల్లా కలెక్టర్‌కు(జిల్లా ఎన్నికల అధికారి) పంపాలని జిల్లా ప్రజాపరిషత్, మున్సిపల్, మోడల్ స్కూల్, ఇతర పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలు పంపారు.
రూల్స్ ఏమి చెబుతున్నాయి?
ఎన్నికల విధుల నుంచి ఎవరికైనా మినహాయింపు ఇవ్వాలంటే ఎన్నికల కమిషనే దానిపై నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల నుంచి ఎంత మంది ఉద్యోగులు అందుబాటులో ఉన్నారు….ఎంతమంది ఎన్నికల విధులకు అవసరం అనే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఎవరికైనా మినహాయింపు ఇవ్వాలా వద్దా అనేది ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుంది. అంటే ఎన్నికల విధుల్లో ఎంత మంది సిబ్బంది అవసరం, ఏఏ క్యాడర్ ఉద్యోగులు అవసరం, ఏఏ క్యాడర్ ఉద్యోగులకు ఏఏ విధులు కేటాయించాలి వంటి అంశాల్లో కేంద్ర ఎన్నికల సంఘమే తుది నిర్ణయం. కాగా, ఉపాధ్యాయులను ఎన్నికల డ్యూటీలో నియమించాలంటూ గతంలో కోర్టులు అనేక తీర్పులు వెలువరించాయి. తమ విధుల్లో బాధ్యతగా ఉండే టీచర్లు ఎన్నికల డ్యూటీని సక్రమంగా, నమ్మకంగా, పారదర్శకంగా నిర్వహించగలరని అభిప్రాయపడ్డాయి.
ఒక్క పాఠాలే చెప్పిస్తున్నారా?
మొదటినుంచీ ఎన్నికల్లో టీచర్లే విధులు నిర్వర్తిస్తున్నారని, అనుభవం అసలేలేని సచివాలయాల ఉద్యోగుల వల్ల ఎన్నికలనిర్వహణ సమస్యగా మారుతుందని పలువురు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. మరోవైపు బోధనేతర పనులు అనే అంశంపై టీచర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. బోధనాంశాల వరకే పరిమితం చేయడం అంటే టీచర్లకు బోధన చేయడమే విధిగా ఉండాలని వాదిస్తున్నారు. కానీ, టీచర్లతో బాత్రూమ్‌ల ఫొటోలు తీయిస్తున్నారు. నాడు- నేడు పనులు చేయిస్తున్నారు. మధ్యాహ్న భోజనం ఫొటోలు తీయడం, ఆన్‌లైన్ హాజరు లాంటి అనేక అదనపు పనులు అప్పగిస్తున్నారు. ఒకవేళ ఎన్నికల విధులు బోధనేతర పని అనుకుంటే.. అది ఐదేళ్లకు ఒకసారి మాత్రమే ఉంటుంది. కానీ, ఈ పనులు తమకు నిత్యకృత్యమయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు