- విద్యార్థుల బయోమెట్రిక్‌కు చురుగ్గా ఏర్పాట్లు
- అమ్మఒడికి 75 శాతం తప్పనిసరి
న్యూస్ టోన్, మచిలీపట్నం : విద్యార్థుల హాజరు పెంచడం.. అమ్మఒడి అర్హత సాధించడం కోసం పాఠశాలల్లో బయోమోట్రిక్ హాజరు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే విద్యార్థుల హాజరు ఉపాధ్యాయులు ఆన్లైన్ ఈ-హాజరు వేస్తున్నారు. ఇక నుంచి ప్రతి విద్యార్థి బడిలోని ప్రత్యేక డివైజ్ ద్వారా వేలిముద్ర హాజరు వేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. నవంబరు ఒకటి నుంచి కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఈనెల 8 నుంచి జిల్లాలో అమలు చేయనున్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. కొవిడ్ తర్వాత విద్యార్థుల హాజరు తక్కువగా నమోదవుతోంది. ప్రైవేటు పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇదే తీరు. అమ్మఒడి ద్వారా హాజరు పెంచవచ్చని చెబుతున్నారు.
జిల్లాలో వివిధ యాజమాన్యాల కింద 4,628 పాఠశాలలున్నాయి. వీటిలో 4,04,787 మంది విద్యార్థులు చదువుతున్నారు. పురపాలక సంఘాలతో పాటు జడ్పీ, ఎంపీపీ, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవల గురుకుల పాఠశాలలు తెరిచినా ఇంకా హాజరు పెరగలేదు. దాంతో విద్యా సంవత్సరంపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. విద్యా సంవత్సరాన్ని కూడా కుదించారు. హాజరు 75 శాతం వచ్చిన వారికి అమ్మఒడి ఇవ్వాలని ప్రాథమికంగా ప్రభుత్వం నిర్ణయించింది. ‘నాడు- నేడు’ కింద బడుల బాగుకు పెద్దఎత్తున వ్యయం చేసింది. ఉపాధ్యాయుల నియామకం.. 3, 4, 5 తరగతుల విలీనం వంటి ప్రక్రియ జరుగుతోంది.
పెరిగిన ప్రవేశాలు..
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ప్రవేశాలు ఈ ఏడాది కాస్త పెరిగాయి. ఇక్కడ వివిధ రకాల వస్తు సామగ్రి అందించడం.. ఆంగ్ల బోధన జరుగుతుండటంతో తల్లిదండ్రులు పిల్లలను వీటికే పంపుతున్నారు. దాంతో 10 నుంచి 15 శాతం మేర ప్రవేశాలు పెరిగాయి. తరగతుల నిర్వహణలో కాస్త జాప్యం జరిగింది. గతేడాది ఆన్లైన్ ద్వారా పరిమితంగా తరగతులు నిర్వహించారు. ఈ ప్రభావం పది, ఇంటర్‌పై పడింది. కొందరికి మాత్రమే ఆశించిన మార్కులు రాగా ఎక్కువ మంది నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో హాజరు పెంచి తరగతులు పరిపుష్ఠం చేయాలని విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈనెల 8 నుంచి అన్ని బడుల్లో ఈ-హాజరు అమలు చేయనున్నారు. ఇందుకు అవసరమైన డివైజ్‌లకు ఆర్డర్లు పెట్టినట్లు సమాచారం. వీటిని విద్యాశాఖ సిద్ధం చేసిన ప్రత్యేక యాప్‌ల ద్వారా అనుసంధానం చేసి ఆధార్ అనుసంధానంగా హాజరు తీసుకోనున్నారు. ఈ విషయమై గూడూరు ఉప విద్యాశాఖాధికారి డాక్టర్ కోడివాక వెంకటేశ్వర్లును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. విద్యార్థుల సంఖ్య, బడి హాజరు పెంచడం.. పోషకాహారం అందజేయడం లక్ష్యంగా బయోమెట్రిక్ విధానం ఉపకరిస్తుందని తెలిపారు. బడి మానేసే వారి సంఖ్య తగ్గుతుందని పేర్కొన్నారు.