- 125 విద్యాలయాల్లో ప్రవేశాల సంఖ్య తగ్గుదల
Aided Schools West Godavari: జిల్లాలో ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య తగ్గుతుండటంపై పాఠశాల విద్యాశాఖ స్పందించింది. మూడేళ్లుగా ఆయా పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు తగ్గుతుండటానికి గల కారణాలు ఏమిటని ప్రశ్నిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు సదరు పాఠశాలల కరస్పాండెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
జిల్లాలో మొత్తం ఎయిడెడ్ పాఠశాలలు 290 ఉన్నాయి. వీటిలో 120 ప్రాథమిక, 4 ప్రాథమికోన్నత, ఒక ఉన్నత పాఠశాల కరస్పాండెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. ఇవన్నీ ప్రభుత్వం నుంచి ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ పొందుతున్న సంస్థలే. వీటిలో పనిచేసే ఉపాధ్యాయులకు, విద్యార్థుల సంఖ్యకు పొంతన లేకుండా ఉంది. ఈ క్రమంలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి ప్రభుత్వ నిధులతో ఎయిడెడ్ పాఠశాలలను సమర్థంగా నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని అధికారులు చెబుతున్నారు.
నిధులు పొందుతున్నా..
ప్రభుత్వ గ్రాంట్ ఇన్ ఎయిడ్ పొందుతూ నెలవారీ వేతనాలు పొందుతున్నా విద్యార్థుల సంఖ్యను పెంచే విషయంలో కరస్పాండెంట్లు సహా ఉపాధ్యాయులెవరూ ప్రత్యేక శ్రద్ధ వహించడంలేదని విద్యాశాఖాధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని వాటిని బలోపేతం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలనుకునే వారి నుంచి ఆమోద పత్రాలను కూడా ఇటీవల సేకరించింది. జిల్లాలో కేవలం ఏడు ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు మాత్రమే ఇలా పత్రాలను అందజేశాయి.
ఇదీ పరిస్థితి
జిల్లాలోని ఎయిడెడ్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలవారీగా వివరాలను జిల్లా విద్యాశాఖ క్షేత్రస్థాయిలో పరిశీలించి సేకరించింది. 2018-19, 2019-20, 2020-21 విద్యాసంవత్సరాల్లో జిల్లాలోని 125 ఎయిడెడ్ పాఠశాలల్లో ఏడాదికి ఒక్కో తరగతిలో ఇద్దరు, ముగ్గురికి మించి నూతన ప్రవేశాలు లేవని గుర్తించారు. కొన్ని పాఠశాలల్లో అన్ని తరగతుల్లో కలిపి 20 నుంచి 30 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని పరిశీలనలో తేలింది.
ఇంతగా విద్యార్థుల ప్రవేశాలు తగ్గడానికిగల కారణాలు ఏమిటో ఈ నెల 20లోగా తెలపాలంటూ ఆయా ఎయిడెడ్ పాఠశాలల కరస్పాండెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ అయినట్లు డీఈవో సీవీ రేణుక స్పష్టం చేశారు. వివరణ సరిగా లేకుంటే ఆయా పాఠశాలలకు ప్రభుత్వ నిధులను నిలిపే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎయిడెడ్ పాఠశాలలకు ప్రభుత్వం అందించిన నిధుల వినియోగపు వివరాలను కూడా సదరు సంస్థల కరస్పాండెంట్లు తెలియజేయాల్సి ఉంటుంది.
తాఖీదుల్లో ఏముందంటే..
ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి, జగనన్న విద్యాకానుక పథకాలతో ప్రభుత్వ పాఠశాలల్లో రెండేళ్లుగా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇవే పథకాలను ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు కూడా వర్తింపజేస్తున్నప్పటికీ ప్రవేశాలు తగ్గడానికి కారణాలు తెలపాలంటూ తాఖీదుల్లో పొందుపరిచారు. గత మూడేళ్ల ప్రవేశాలను ప్రామాణికంగా తీసుకుని వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ తరహా వివరణ కోరుతూ తాఖీదులు ఇవ్వడం ఆయా విద్యాసంస్థల్లో అలజడి రేపుతోంది.