- మినీ డిఎస్సి ?
- తక్కువ పోస్టులతో నోటిఫికేషన్కు యత్నం
- విద్యాశాఖ కసరత్తు
నాలుగున్నరేళ్లల్లో ఒక్క డిఎస్ఎసి నోటిఫికేషన్ విడుదల చేయని వైసిపి ప్రభుత్వం ఎన్నికల వేళ మినీ డిఎసి సి విడుదలకు ప్రయత్నిస్తోంది. నిరుద్యోగ అభ్యర్థుల్లో అసంతృప్తిని తగ్గించే ప్రయత్నంలో భాగంగానే ఈ కసరత్తు చేస్తోంది. త్వరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అంటూ నిన్నటి వరకు ప్రకటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు చివరకు తక్కువ పోస్టులతో సరిపెడుతున్నట్లు సమాచారం. సుమారు 25 వేల పోస్టులు విద్యాశాఖలో ఖాళీగా ఉన్నా, మొత్తాన్ని భర్తీ చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1,88,162 కాగా 1,69,642 మంది మాత్రమే పనిచేస్తున్నారని విద్యాశాఖ చెబుతోంది. ఈ ప్రకారం కూడా 18,520 పోస్టుల ఖాళీలు ఉండాలి. కేవలం 8,366 మాత్రమే ఉన్నాయని అధికారులు అంటున్నారు. జనవరి 31వ తేదీ నాటికి మరో 5 వేల పోస్టుల్లో ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేయనున్నారు. మొత్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారమే 23,520 పోస్టులు ఖాళీ అన్నమాట. వీటిని భర్తీ చేయకుండా కేవలం 5 వేల నుంచి 6 వేలలోపు పోస్టులను మాత్రమే భర్తీ చేసే అవకాశంఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పోస్టుల భర్తీ ప్రతిపాదనను ఆర్థిక శాఖకు త్వరలో పంపుతామని, అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదలవుతుందని చెబుతున్నారు. ఈ ప్రక్రియకు మొత్తం ఒక నెల సమయం పడుతుందని అంటున్నారు.
జిఓ 117తో 10,154 పోస్టులు రద్దు
రేషనలైజేషన్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం జిఓ 117ను గతేడాది విడుదల చేసింది. గతంలో ఉన్న ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని పెంచేసింది. ప్రాథమిక పాఠశాలల్లో గతంలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి 1:20గా ఉండేది. జిఓ 117తో 1:30 చేసింది.. గతంలో విద్యార్థుల సంఖ్య 40 దాటితే ఉండే మూడో ఎసిటి పోస్టు, ఇప్పుడు 60 దాటితేనే ఉంది. ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా మంజూరు. చేయాల్సిన పోస్టులను తరగతుల ఆధారంగా మంజూరు చేసింది. దీంతో వేల సంఖ్యలో పోస్టులను ప్రభుత్వం కుదించింది. ఈ జిఓతో మొత్తం 10,514 ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. అదేవిధంగా తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడంతో సుమారు మరో 15 వేల పోస్టులు రద్దయ్యాయి. సంస్కరణల పేరుతో రోజుకో విధానం తీసుకొస్తున్న ప్రభుత్వం… ఉపాధ్యాయులను నియమించడం లేదు. దీంతో ఉన్నవారిపై భారం పడటమే కాకుండా లక్షల సంఖ్యలో నిరుద్యోగులు పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు.