వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ వచ్చే వారం నుంచి అమల్లోకి రానుంది. అయితే ఈ పాలసీని వాట్సాప్ వినియోగదారులంతా అంగీకరించాల్సి ఉంటుంది. ఒక వేళ అంగీకరించకపోతే ఏమవుతుందంటే..
ఈ ఏడాది ప్రారంభంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన నూతన ప్రైవసీ పాలసీపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటన అనంతరం వాట్సాప్ అనేక విమర్శలను ఎదుర్కొంది. అనేక మంది వినియోగదారులను సైతం దూరం చేసుకుంది. యూజర్లు తప్పనిసరిగా తమ నూతన ప్రైవసీ పాలసీ నిబంధనలను అంగీకరించాల్సిందేనని వాట్సాప్ తేల్చిచెప్పడంతో వినియోగదారులు యాప్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వాట్సాప్ ను వీడి సిగ్నల్, టెలిగ్రామ్ తదితర ఇతర యాప్ ల్లో ఖాతాలను ప్రారంభించారు అనేక మంది యూజర్లు. దీంతో ఆ సమయంలో ఎట్టకేలకు వాట్సాప్ వెనక్కు తగ్గింది. తమ నూతన పాలసీ అమలను మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సమయంలో తమ నూతన ప్రైవసీ పాలసీపై యూజర్లకు అవగాహన కల్పించేందకు ప్రయత్నించింది. వాట్సాప్ లోని ప్రైవేటు సంభాషణలను ఎవరూ చదివే అవకాశం ఉండదని అనేక సార్లు స్పష్టం చేసింది వాట్సాప్. ఈ నూతన నిబంధనలు అంగీకరించినంత మాత్రాన యాప్ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవని వాట్సాప్ తెలిపింది.
సాధారణ వినియోగదారులకు అన్నీ గతంలో మాదిరిగానే ఉంటాయని స్పష్టం చేసింది. వాట్సాప్‌లో వ్యాపార కోణంలో పంపే మెసేజ్‌లకు మాత్రమే తమ నూతన అప్‌డేట్ వర్తిస్తుందని వివరించింది వాట్సాప్. ఇదిలా ఉంటే వాట్సాప్ పొడిగించిన మూడు నెలల గడువు త్వరలో ముగియనుంది. మే 15 నుంచి వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీ అమలులోకి రానుంది. అయితే ఒక వేళ ఈ ప్రైవసీ పాలసీ నిబంధనలను అంగీకరించకపోతే ఏమవుతుందన్న సందేహం అందరిలో వ్యక్తమవుతోంది. ఈ కొత్త పాలసీని అంగీకరించపోతే వాట్సాప్ ఖాతా డిలీట్ చేయబడుతుందని గతంలో సంస్థ తెలిపింది.
అయితే.. వాట్సాప్ తాజాగా ఈ విషయమై కీలక ప్రకటన చేసింది. నూతన నిబంధనలు అంగీకరించకపోతే ఖాతా డిలీట్ కాబడదని స్పష్టం చేసింది. అయితే వాట్సాప్ సేవలను మాత్రం పూర్తిగా వినియోగించుకోలేరని తెలిపింది. వినియోగదారులు కాల్స్, నోటిఫికేషన్లను మాత్రం పొందగలుగుతారు. కానీ మెసేజ్ లను పంపించడం, చదవడం మాత్రం చేయలేరు. అయితే ఈ అవకాశం కొద్ది రోజుల వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఈ గడువు ఎప్పటివరకు ఉంటుందన్న విషయమై వాట్సాప్ నుంచి పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.