‘Hard to believe’: ఒకసారి కరోనా వచ్చిన తర్వాత.. తగ్గిపోయాక కూడా దాని ప్రభావం మన శరీరంలో ఉంటుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత ఇంక ఇబ్బందేం లేదు అనుకుంటే కుదరదు.. కోవిడ్ -19 నుంచి ప్రాణాలతో బయటపడినవారికి డయాబెటిస్(వ్యవహరిక భాషలో షుగర్) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని, చాలా మందికి డయాబెటిస్ వస్తోందని జియాద్ అల్-అలీ(Ziyad Al-Aly’s Research) పరిశోధనా బృందం స్పష్టం చేస్తుంది.
వాస్తవానికి తన బృందంలోని ఐదుగురు చెప్పినప్పుడు డేటా తప్పు అయ్యి ఉండవచ్చునని, మళ్ళీ పరిశీలించాలని కోరినట్లు చెప్పారు. అప్పుడు కూడా నమ్మలేని నిజం బయటపడినట్లు చెప్పారు. మిలియన్ల మంది రోగుల రికార్డులను పరిశీలించిన తరువాత అదే ఫలితాలను తిరిగి ఇచ్చారని, Covid-19 సోకినప్పటికి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు.. కోవిడ్ తగ్గిన కొద్ది రోజులకు డయాబెటిస్ భారిన పడినట్లు చెప్పారు.
కోవిడ్-19 ప్రపంచంలో డయాబెటిస్ రోగులను తీవ్రతరం చేసే అవకాశం ఉందని, అందువల్ల ప్రజారోగ్యానికి భారీగా నష్టం వాటిల్లుతుందని అధ్యయనం చెబుతుంది. కరోనా వైరస్ డయాబెటిస్‌ని ఎలా ప్రేరేపిస్తోంది అని, అంతర్లీన విధానాలు స్పష్టంగా లేవని అన్నారు. కొంతమంది వైద్యులు SARS-CoV-2 వైరస్ ప్యాంక్రియాస్‌ను దెబ్బతీస్తుందని అనుమానిస్తున్నారు.
రక్తం-చక్కెరను శక్తిగా మార్చడానికి అవసరమైన ఇన్సులిన్‌ను తయారుచేసే గ్రంథికి ఇబ్బంది కలగడంతో ఈ పరిస్థితి వస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆందోళనకర అంశం ఏంటంటే? పిల్లల్లో తేలికపాటి కరోనావైరస్ కేసుల్లో కూడా డయాబెటిస్ వస్తున్నట్లుగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కరోనావైరస్ సోకిన సమయం కంటే.. కోలుకున్న తర్వాతి రోజులే అత్యంత కీలకమైనవని వైద్య నిపుణులు చెబుతున్నారని.. అసలు యుద్ధమంతా ఆ తర్వాతే మొదలవుతుందని స్పష్టం చేస్తున్నారు.
కోవిడ్-19 నుంచి కోలుకొని ‘నెగెటివ్’ నిర్ధారణ కాగానే. ఆరోగ్యానికి ఢోకా లేదనే అతివిశ్వాసంతో వ్యవహరించొద్దని సూచిస్తున్నారు. నెగెటివ్ వచ్చిన తర్వాత దాదాపు మూడు నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలో క్రమం తప్పకుండా మందులు వాడటం మంచిదని అభిప్రాయపడుతున్నారు. గుండె, మెదడు, కిడ్నీ వంటి కీలక వ్యవస్థల్లో సమస్యలు తలెత్తే ముప్పు పొంచి ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
కరోనా ప్రభావం తగ్గిన తర్వాత 100 మందిలో ఇద్దరికి గుండెపోటు, 100 మందిలో ఒకరికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తున్నాయి. వైరస్ సోకిన 100 మందిలో సుమారు 15 మందికి షుగర్ లెవల్స్ భారీగా పెరిగిపోతున్నాయట.. కరోనా తగ్గిపోయిన తర్వాత షుగర్ కంట్రోల్ కావట్లేదని చెబుతున్నారు.