Corona second wave: ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య సంక్షోభంలో భారతదేశాన్ని ముంచెత్తిన కరోనావైరస్ రెండో వేవ్ రాబోయే వారాల్లో మరింత విరుచుకుపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని పరిశోధనలు చెబుతున్న దాని ప్రకారం మరణాల సంఖ్య ప్రస్తుత స్థాయిలను మించి రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఉన్న ఇదే పోకడలు కొనసాగితే జూన్ 11 నాటికి 404,000 మరణాలు సంభవిస్తాయని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బృందం చెబుతోంది. వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ నుండి వచ్చిన ఒక లెక్క జూలై చివరి నాటికి 1,018,879 మరణాలను అంచనా వేసింది.
భారతదేశం వంటి విశాలమైన దేశంలో కరోనావైరస్ కేసులను ఊహించడం చాలా కష్టం. పరీక్షలు అలాగే సామాజిక దూరం వంటి ప్రజారోగ్య చర్యలను భారతదేశం వేగవంతం చేయవలసిన అవసరాన్ని ఈ సూచనలు ప్రతిబింబిస్తున్నాయి. ఒకవేళ ఈ అంచనాలను నివారించినా కూడా, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ -19 మరణాల సంఖ్యను రికార్డు చేసే అవకాశం ఉంది. యు.ఎస్ ప్రస్తుతం అత్యధిక సంఖ్యలో 578,000 మరణాలను కలిగి ఉంది.
భారతదేశంలో మంగళవారం 357,229 కొత్త కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 20 మిలియన్ల మంది ఇప్పటివరకూ కరోనా బారిన పడ్డారు. అదేవిధంగా మొత్తం మరణాల సంఖ్య 222,408 కు చేరుకుంది. ఇటీవలి వారాల్లో, శ్మశానవాటికలకు వెలుపల క్యూ లైన్లు.. అంబులెన్స్ లను వెనక్కి పంపించడం వంటి దృశ్యాలు సర్వ సాధారణం అయిపోయాయి. ఇది దేశంలోని ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితిని సూచిస్తోంది.
”రాబోయే నాలుగు నుంచి ఆరు వారాలు భారతదేశానికి అత్యంత గడ్డు కాలంగా చెప్పొచ్చు.” అని బ్రౌన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ ఆశిష్ అన్నారు. ఇప్పుడు ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఏ చర్యలు తీసుకుంటారు అనే దానిమీద ఆధార పడి ఈ లెక్క ఆరు లేదా ఎనిమిది వారాలకు చేరే అవకాశం కొట్టి పారేయలేం. అని ఆయన చెబుతున్నారు.
ఢిల్లీ,, ఛత్తీస్గడ్, మహారాష్ట్రలతో సహా సుమారు డజను రాష్ట్రాల్లో, రోజువారీ కొత్త కేసుల సంఖ్యా అధికంగా రికార్డు అయ్యే అవకాశం ఉన్నట్టు మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.
ఈ సుదీర్ఘ సంక్షోభం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ప్రజాదరణను తగ్గించే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా, గత సంవత్సరం ఆర్థిక మాంద్యం నుండి భారతదేశం కోలుకోవడం మందగిస్తుంది. బ్లూమ్‌బెర్గ్ ఎకనామిక్స్ మార్చి 2022 తో ముగిసిన సంవత్సరానికి భారతదేశ ఆర్ధిక వృద్ధి ప్రొజెక్షన్‌ను 12.6% నుండి 10.7 శాతానికి తగ్గించింది. గత సంవత్సరం కఠినమైన లాక్డౌన్ కారణంగా ఈ సంఖ్యలు కూడా తక్కువ స్థాయిలో నిలిచిపోయాయి.