Telangana: సాగినంత కాలం బాగానే ఉంటుంది. తేడా వచ్చిందో కత్తులు నూరుకోవడమే.
విద్యాశాఖలో ఓ అధికారి విషయంలో అదే జరిగిందట. ఓ టీచర్ యూనియన్ దెబ్బకు
సీటు మారడమే కాదు.. ఏకంగా వేటు పడింది. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో
ఆసక్తికర చర్చ జరుగుతున్న అంశాలేంటి ?
సస్పెన్షన్ వెనక పాత్రధారులు వేరా?
పీవీ శ్రీహరి. తెలంగాణ ఓపెన్ స్కూల్స్ సొసైటీ డైరెక్టర్. ఆయన్ని
సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులు ఇచ్చారు. ఈ
ఉత్తర్వులే ఇప్పుడు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఒక
ఉన్నతాధికారిపై తీసుకున్న చర్యలు.. దానికి దారితీసిన పరిస్థితులపై కథలు
కథలుగా చెప్పుకొంటున్నారు. సమస్య ఎక్కడెక్కిడో వెళ్తోంది. ఎవరెవరో
పాత్రధారులు అంటూ కొత్త పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.
ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యతో రగడ!
పెద్దపల్లి DEO ఆఫీస్‌లోని సమగ్ర శిక్షా అభియాన్ విభాగంలో
ఔట్సోర్సింగ్ ఉద్యోగి రమేష్ 2019 ఆగస్టులో ఆత్మహత్య చేసుకున్నారు. SSA
అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఉన్న శ్రీహరి, డీఈవో ఆఫీస్‌లో GSDOగా
పనిచేస్తున్న పద్మ కలిసి.. తనను సెక్టోరియల్ అధికారి కాకుండా
అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ రమేష్ ఓ లేఖ కూడా రాశారు. వారిద్దరూ
వేధిస్తున్నట్టు కూడా ఆరోపించారు. పోలీసులు వారిపై కేసు పెట్టడంతో శ్రీహరి
గోదావరిఖని వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు.
ప్రాధాన్యం లేని విభాగానికి బదిలీ చేశాక వేటు!
ఆ కేసు కారణంగా శ్రీహరిని ప్రాధాన్యం లేని ఓపెన్ స్కూల్స్ విభాగానికి
బదిలీ చేశారు. ఈ ట్రాన్స్ఫర్ తప్పని పరిస్థితుల్లో చేస్తున్నట్టు ఆ
పైఅధికారులు శ్రీహరికి చెప్పారట. ఇప్పుడేమో సస్పెండ్ చేశారు. విద్యాశాఖ
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌తో చర్చించిన తర్వాత వేటు
వేసినట్టు ఉత్తర్వుల్లో ప్రస్తావించారు డైరెక్టర్. ఇప్పటికే పన్మిష్మెంట్
కింద ప్రాధాన్యం లేని పోస్ట్‌కి బదిలీ చేశాక మళ్లీ సస్పెండ్ చేయడమే
చర్చగా మారింది.
టీచర్ యూనియన్ నేతల ఒత్తిడి ఉందా?
అధికారపార్టికి మద్దతు ఇస్తోన్న ఓ టీచర్ల సంఘం ఒత్తిళ్ల వల్లే
శ్రీహరిపై చర్యలు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. గతలో సదరు సంఘం
నేతలకు, ఆ యూనియన్ ఎమ్మెల్సీకి శ్రీహరి సరైన రెస్పాన్స్ ఇవ్వలేదట. దానిని
మనసులో పెట్టుకునే టైమ్ కోసం ఎదురు చూశారట యూనియన్ పెద్దలు. ఇటీవల
పీఆర్సీ ప్రకటించాక ప్రభుత్వ పెద్దలను యూనియన్ నాయకులు కలిశారు. ఆ సమయంలో
చేసిన ప్రస్తావన ఫలితంగానే బదిలీ చేశాక వేటు వేశారని అనుకుంటున్నారు. అయితే
శ్రీహరిని సస్పెండ్ చేసే అధికారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు లేదని
ఉద్యోగ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అది ప్రభుత్వం చేయాల్సిన పనిగా
చెబుతున్నాయి. ఇది ఇక్కడితో ఆగబోదని.. మరిన్ని మలుపులు తిరుగుతుందని
అనుకుంటున్నారు. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.
Source: NTV Telugu (News Powered by NTV Telugu)