Home Loan Tips | మీకు హోమ్ లోన్ ఉందా? ఇంటి రుణం తీసుకోవాలనుకుంటున్నారా? వడ్డీ భారం ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి.
సొంతింటి కల నెరవేర్చుకోవాలి అనుకునే వారికి ఇది సరైన సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే, అనేక బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు గత 15 ఏళ్లలో ఎప్పుడ లేనంతగా హోమ్లోన్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా బ్యాంకులు వరుసగా వడ్డీ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఎస్బీఐలో రూ .75 లక్షల వరకు తీసుకునే హోమ్లోన్లపై 6.7 శాతం, రూ 75 లక్షలకు పైబడి తీసుకునే రుణాలపై 6.75 శాతం మాత్రమే వడ్డీని వసూలు చేస్తుంది. మరోవైపు, మహిళా రుణగ్రహీతలు 5 బిపిఎస్ అదనపు వడ్డీ రాయితీని అందిస్తుంది. కాబట్టి, వడ్డీరేట్లు తగ్గుతున్న తరుణంలో ఇతర బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీ అందించే బ్యాంకులకు మీ లోన్ అకౌంట్‌ను బదిలీ చేయండి. తద్వారా మీకు చాలా డబ్బు ఆదా అవుతుంది. ప్రస్తుతం, అతి తక్కువ వడ్డీ రేట్లకే హోమ్‌లోన్ అందిస్తున్న టాప్ బ్యాంకులు, హెచ్‌ఎఫ్‌సిలను పరిశీలించండి. అంతేకాక, మీ వడ్డీ భారం తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఓలుక్కేయండి.
వడ్డీ భారాన్ని తగ్గించే చిట్కాలు
మీ నెలవారీ EMI ను నిర్ణయించడంలో మీరు తీసుకున్న అసలు, వడ్డీ ముఖ్య పాత్ర వహిస్తాయి. ఒకవేళ మీరు కొత్తగా హోమ్‌లోన్ తీసుకుంటున్నా.. లేదా ఇదివరకే హోమ్‌లోన్ తీసుకొని అధిక వడ్డీ రేట్లు చెల్లిస్తున్నా.. మీ వడ్డీ భారం తగ్గించుకునేందుకు ఇది చక్కటి సమయం. కొన్ని చిట్కాలతో మీ వడ్డీ భారాన్ని తగ్గించుకోండి.
కొత్తగా హోమ్‌లోన్ తీసుకునేవారైతే…
మీరు కొత్తగా హోమ్‌లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, మీ నెలవారీ ఈఎంఐ భారాన్ని తగ్గించుకునేందుకు తక్కువ వడ్డీకే రుణాలను అందజేసే బ్యాంకులను వెతకండి. ఇందుకోసం ఆయా బ్యాంకుల అధికారిక వెబ్సైట్లను పరిశీలించండి. అక్కడ వివిధ రుణదాతలు వసూలు చేసే వడ్డీ రేట్లు, ఛార్జీలు, ఇతర ఖర్చుల గురించి అవగాహన పెంచుకోండి. ఏ బ్యాంకులో రుణం తీసుకుంటే తక్కువ భారం పడుతుందనే విషయం పరిశీలించండి. లోన్ వ్యవధిని మీరు ఎంత ఎక్కువ కాలం ఎంచుకుంటే అంత ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, మీ జీతం, నెలవారీ ఖర్చులను పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత తక్కువ వ్యవధినే ఎంచుకోండి. అంతేకాక, ఎక్కువ డౌన్ పేమెంట్‌తో హోమ్‌లోన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా మీపై నెలవారీ ఈఎంఐ భారం తగ్గుతుంది.
ఇప్పటికే హోమ్‌లోన్ ఉన్నవారైతే…
మీరు ఇదివరకే ఏదైనా బ్యాంకులో హోమ్‌లోన్ తీసుకున్నట్లైతే.. మీ వడ్డీ భారాన్ని తగ్గించుకునేందకు కొన్ని చిట్కాలను పాటించండి. ప్రస్తుతం వడ్డీ రేట్లు తగ్గాయి కనుక మీ లోన్ అకౌంట్‌ను పాత బ్యాంకు నుంచి తక్కువ వడ్డీ అందించే బ్యాంకుకు బదిలీ చేసుకోండి. లేదంటే మీ లోన్‌లో కొంత భాగాన్ని ముందస్తుగా చెల్లించడం ద్వారా కూడా మీ రుణ బ్యాలెన్స్‌ను తగ్గుతుంది. ఫలితంగా, మీ EMI మొత్తం లేదా తిరిగి చెల్లించే కాలం తగ్గుతుంది. దాదాపు అన్ని బ్యాంకులు మీరు చెల్లించని హోమ్‌లోన్ బ్యాలెన్స్‌ను పూర్తిగా లేదా పాక్షికంగా ముందుగానే చెల్లించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. ఈ ఆప్షన్‌ను ఉపయోగించుకొని మీ నెలవారీ EMI భారాన్ని తగ్గించుకోండి.
అధిక హోమ్‌లోన్ ఎలిజిబులిటీ కోసం
తక్కువ వడ్డీకే రుణం లభించాలంటే మీరు మెరుగైన సిబిల్ స్కోరును కలిగి ఉండటం చాలా ముఖ్యం. బ్యాంకులు సహజంగా మీ ఉద్యోగం, జీతం, సిబిల్ స్కోర్‌ను బట్టి వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. అందువల్ల మీరు ఇదివరకు తీసుకున్న రుణాల EMI లు, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, ఇతర బిల్లులను గడువులోగా చెల్లించండి. తద్వారా, మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపర్చుకోండి. మీరు వివాహితులైతే మీ భార్యను సహ యజమానికిగా చేర్చి హోమ్‌లోన్ తీసుకోవడం లాభిస్తుంది. ఎందుకంటే, ఇది మీ లోన్ అర్హత మొత్తాన్ని పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాక, ఆయా బ్యాంకులు మహిళలకు అందజేసే అనేక రాయితీలు, ప్రయోజనాలను పొందవచ్చు. మీ భార్య కూడా ఉద్యోగం చేస్తున్నట్లైతే మీ రుణ అర్హత మరింత పెరుగుంది. తద్వారా తక్కువ వడ్డీకే ఎక్కువ రుణాన్ని పొందవచ్చు. అంతేకాక, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులపై రాయితీలు, ఇతర పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.
పన్ను ప్రయోజనాలు
హోమ్‌లోన్‌పై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. సెక్షన్ 80 సి, సెక్షన్ 80 ఈఈ, సెక్షన్ 80 ఈఈఏ కింద అనేక పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పన్ను మినహాయింపులకు అర్హత పొందడానికి, రుణ మొత్తం రూ .35 లక్షల కన్నా తక్కువ ఉండాలి. అంతేకాక, ఆస్తి మదింపు రూ .50 లక్షలు మించకూడదు. జాయింట్ అకౌంట్ హోల్డర్ల విషయంలో హోమ్‌లోన్ వడ్డీలో రూ .2 లక్షల వరకు, ప్రిన్సిపాల్ అమౌంట్‌పై రూ .1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
తక్కువ వడ్డీకే హోమ్‌లోన్ అందిస్తున్న బ్యాంకులు
కోటక్ మహీంద్రా బ్యాంక్ 6.65% , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) 6.75% అతి తక్కువ వడ్డీరేటుకే హోమ్లోన్లను అందిస్తున్నాయి. ఇక, ఐసిఐసిఐ బ్యాంక్ రూ. 75 లక్షల వరకు రుణాలపై 6.70 శాతానికి, రూ .75 లక్షలకు పైబడిన రుణాలపై 6.75 శాతం వడ్డీకే హోమ్లోన్లను అందిస్తుంది. ఈ వడ్డీ రేట్లన్నీ ఈ నెలాఖరు వరకు అమల్లో ఉంటాయని ఆయా బ్యాంకులు పేర్కొన్నాయి.