- ఆదివారం..కథా సమయం
- గ్రంథాలయాల్లో విద్యార్థులతో సామూహిక పఠనం
- 3-9 తరగతుల వారిలో నైపుణ్య పెంపుదలే లక్ష్యం
ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేస్తూ విద్యార్థుల్లో పఠన నైపుణ్యం పెంచేందుకు ‘ఆదివారం కథా సమయం (సండే స్టోరీ టైమ్)’ పేరుతో గ్రంథాలయాల్లో పఠన కార్యక్రమానికి పాఠశాల విద్యా శాఖ శ్రీకారం చుట్టింది. ఈ నెల 6 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం 10- 12 గంటల మధ్య రెండు గంటలసేపు ముందుగా ఎంపిక చేసుకున్న కథలను చదవాల్సి ఉంటుంది. చదువంటే మా కిష్టం కార్యక్రమంలో భాగంగా దీనికి రూపకల్పన చేసినట్లు డీఈవో సీవీ రేణుక వెల్లడించారు. ఈ కార్యక్రమం అమలు కోసం ప్రజా గ్రంథాలయాలు, సామూహిక పఠన కేంద్రాల ప్రాంతాలను గుర్తించడంతో పాటు వాటిని సందర్శించి, ఉదయం 10 గంటలకు విద్యార్థులను ఆహ్వానించి కొవిడ్ నిబంధనలను పాటిస్తూ సామూహిక పఠనం చేయించాలి.
సన్నద్ధమిలా..
●స్థానికంగా ఉండే గ్రంథాలయాలు, పుస్తక కేంద్రాల్లో (బుక్ డిపాజిట్ కేంద్రాలు) కాలనీలు, వీధుల్లో లేదా వార్డుల్లో సామూహిక పఠన సమావేశాలు నిర్వహించాలి.
● గ్రంథ పాలకుడు, సచివాలయంలోని విద్య, సంక్షేమ సహాయకుడు, వాలంటీర్లతో ప్రధానోపాధ్యాయుడు సమావేశం ఏర్పాటు చేయాలి.
● స్థానికంగా ఉన్న 3 నుంచి 9 తరగతుల విద్యార్థులను సమావేశ పరచి ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య కార్యక్రమం కొనసాగించాలి.
● ఆదివారం కథా సమయంలో పాల్గొనేలా ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు ప్రోత్సహించాలి.
● స్థానిక గ్రంథాలయం నుంచి వీలైనంత వరకు బాలసాహిత్యం విభాగానికి చెందిన కథల పుస్తకాలను ఎంపిక చేసుకుని గ్రంథ పాలకుడు, విద్యా సంక్షేమ సహాయకులు, వాలంటీర్లలో ఒకరిని కథలను చదివేందుకు ఎంపిక చేయాలి. కథను చదివి వివరించిన తరువాత విద్యార్థులంతా అదే కథను పఠించాలి.
WE LOVE READING STORY TIME