- పరిశీలన పూర్తి… వెబ్‌సైట్‌లో అప్‌లోడ్
నెల్లూరు (విద్య): ఉపాధ్యాయుల బదిలీల మార్గదర్శకాల్లో కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇంకోవైపు బదిలీల కోసం దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అన్ని కేటగిరీల్లో 5054 మంది దరఖాస్తు చేసుకోగా- వారిలో 4997 మంది మిగిలారు. వీరిలో 1638 మంది నిర్దుష్ట కాలపరిమితి సర్వీసు పూర్తయి.. తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారే. షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల ప్రక్రియ శనివారం వరకు ఉండగా- జిల్లా విద్యాశాఖాధికారులు పూర్తి చేశారు. ఆ జాబితాను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులకు అయిదేళ్లు పనిచేసిన స్థానం నుంచి బదిలీ తప్పనిసరి. అయిదేళ్లు దాటాక, ఎన్నేళ్ల సర్వీసు అయినా 15 పాయింట్లు మాత్రమే ఇచ్చేలా సీలింగ్ పెట్టారు. దీనిపై స్టేషన్ సీనియర్లు అభ్యంతరం తెలపగా.. పని చేస్తున్న ఏడాది నుంచే అన్ని పాయింట్లు లెక్కించాలని నిర్ణయించారు. దీంతో బదిలీ అయ్యే ప్రధానోపాధ్యాయులు తగ్గనున్నారు. మిగిలిన కేటగిరీలనూ కలిపితే సుమారు 300 మందికి ప్రయోజనం కలగనుందని జిల్లా అధికారులు చెబుతున్నారు. వ్యక్తిగత, ప్రతిభ, వైకల్యం, అనారోగ్యం, వితంతువులు, అవివాహితులు.. కేటగిరీలకు పాయింట్లు కేటాయించారు. ఇలా 250 మంది కోరుకున్న చోటకు వెళ్లే అవకాశం ఉంది. వెబ్ కౌన్సెలింగ్ డెమో గురించి ఏమీ తెలపలేదని ఉపాధ్యాయులు అంటున్నారు.
పారదర్శకంగా చేపడుతున్నాం : డీఈవో పి.రమేష్
పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా చేస్తున్నాం. సమస్యలను తగిన ఆధారాలతో విన్నవిస్తే.. పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
ఇదీ షెడ్యూల్
నవంబరు 30 – డిసెంబరు 2: ప్రొవిజినల్ సీనియారిటీ జాబితా ప్రదర్శన
డిసెంబరు 3, 4: అభ్యంతరాల స్వీకరణ
5, 6, 7: జేసీ ఆధ్వర్యంలో పరిశీలన
8, 9, 10: సీనియారిటీ తుది జాబితా ప్రకటన
11-15: వెబ్ ఆప్షన్ల నమోదు
16-21: బదిలీల ఉత్తర్వుల ప్రదర్శన
22-23: సాంకేతిక ఇబ్బందుల స్వీకరణ
24: బదిలీల ఉత్తర్వులు డౌన్లోడ్ చేసుకోవచ్చు
TIME FOR TRANSFERS