- 49 మంది అనర్హులుగా గుర్తింపు
- జేసీ వద్దకు దస్త్రం
అనంతపురం విద్య, న్యూస్ టోన్: అక్రమ మార్గాల్లో పాయింట్లు పొందాలనుకునే ఉపాధ్యాయులకు అడ్డుకట్ట పడింది. ఏకంగా 49 మంది ధ్రువపత్రాలు ఆమోదయోగ్యంగా లేవని వైద్య బృందం తేల్చింది. ఈ మేరకు విద్యాశాఖకు జాబితా అందించారు. తప్పుడు పత్రాలతో దగ్గరి ప్రదేశాలు పొందాలనే ఉద్దేశంతో లోగుట్టుగా మంత్రాంగం జరిపిన ఉపాధ్యాయుల తీరుపై ఈనెల 20న ‘వారిది అడ్డదారి!’, 22న ‘వారి రోగం వైద్యులే తేల్చాలప్పా!’ శీర్షికన ‘ఈనాడు’లో కథనాలు ప్రచురించిన విషయం విదితమే. ఈ కథనాలపై స్పందించిన విద్యాశాఖ అధికారులు వైద్య ధ్రువీకరణ పత్రాలను వైద్యులకు పంపారు. ఇందులో 49 మంది ఉపాధ్యాయులు అందించిన పత్రాలు అర్హతలేనివిగా తేల్చారు. పాఠశాల సహాయకుల్లో 11 మంది మెడికల్ ఇల్‌నెస్, 9 మంది జీఓల్లో లేని రోగాలకు సంబంధించి పత్రాలు ఇచ్చినట్లు గుర్తించారు. ఎస్జీటీలు 29 మంది ఉన్నారు. దీనిపై నివేదికను సిద్ధం చేసి జేసీకి అందజేశారు. మరో 15 మందికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.
ఆన్‌లైన్‌లో నమోదు
ఉపాధ్యాయుల పాయింట్లను విద్యాశాఖ కమిషనరుకు పంపే ప్రక్రియ ఆరంభమైంది. శుక్రవారం జిల్లా సైన్సు సెంటర్‌లో ప్రక్రియ చేపట్టారు. మొత్తం 7,410 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో తప్పనిసరి బదిలీల జాబితాలో 2094 మంది ఉన్నారు. విజ్ఞప్తి బదిలీల్లో మరో 5,246 మంది ఉన్నారు. తొలిరోజే 1100 మంది ఉపాధ్యాయుల బదిలీల దరఖాస్తులు, వారి పాయింట్ల వివరాలను ఆన్‌లైన్ ద్వారా కమిషనరు కార్యాలయానికి అనుసంధానం చేశారు.
డీఈఓ బ్లాగ్‌స్పాట్‌లో ఖాళీలు
టీచర్ల బదిలీలకు సంబంధించిన ఖాళీలను డీఈఓ బ్లాగ్‌స్పాట్‌లో అందుబాటులో ఉంచామని డీఈఓ శామ్యూల్ తెలిపారు. అభ్యంతరాలు ఉంటే 28వతేదీ సాయంత్రం లోపు తగు రికార్డులతో అందించాలని సూచించారు.