- ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి
న్యూస్ టోన్, ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: పది విద్యార్థులకు నేరుగా తుది పరీక్షలు మాత్రమే ఉంటాయని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని బీవీఆర్ జడ్పీ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన గుంటూరు డీఈవో గంగాభవానితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులకు మధ్యలో ఎలాంటి పరీక్షలు ఉండవని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా మినహా రాష్ట్రంలోని పాఠశాలల్లో బుధవారం విద్యార్థుల హాజరు 70 శాతం వరకు నమోదైందన్నారు. నెల్లూరు జిల్లాలో తుపాను నేపథ్యంలో మూడు రోజులపాటు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మూడు రకాల అంశాలతో అకడమిక్ క్యాలెండర్ రూపొందించామని వివరించారు. తరగతి గదిలో మాత్రమే బోధించేవి, ఇంటి దగ్గర నేర్చుకునేవి, స్వతహాగా ఐచ్ఛికంగా నేర్చుకునే అంశాలున్నాయని తెలిపారు. ఐచ్ఛికంగా నేర్చుకునే 35 శాతం అంశాలను పరీక్షల్లో ఇవ్వబోమని, భవిష్యత్తులో వారు రాసే పోటీ పరీక్షలకు ఈ సిలబస్ ఉపయోగపడుతుందని వివరించారు.