- వచ్చేనెల 24నాటికి ప్రక్రియ పూర్తి
- ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
న్యూస్ టోన్, ఒంగోలు విద్య, నవంబరు 25 : ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం తాజా షెడ్యూల్ను విడుదల చేసింది. పాయింట్ల కేటాయింపులో మార్పులు చేసిన నేపథ్యంలో షెడ్యూల్ను పది రోజులు పొడిగించింది. మొదట ప్రకటించిన ప్రకారం డిసెంబరు 14తేదీకి బదిలీల ప్రక్రియ ముగియాల్సి ఉండగా తాజా షెడ్యూల్ ప్రకారం 10రోజులు ఆలస్యంగా డిసెంబరు 24నాటికి పూర్తికానుంది. బదిలీల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ఇప్పటికే పూర్తయ్యాయి. తాజాగా పాయింట్ల కేటాయింపులో మార్పులు చేసినందున దరఖాస్తులను పునఃపరిశీలన చేయనున్నారు.
తాజా షెడ్యూలు ఇదీ.
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన తాజా షెడ్యూల్ ఈనెల 28 నుంచి అమల్లోకి వస్తుంది.
🔹ఈనెల 28, 29 తేదీలలో ప్రత్యేక బృందాలు బదిలీ దరఖాస్తులను పునఃపరిశీలిస్తాయి.
🔹ఈనెల 30 నుంచి డిసెంబరు 2వరకూ ఉపాధ్యాయులకు లభించిన పాయింట్ల ఆధారంగా ప్రాథమిక సీనియారిటీ జాబితాను ప్రకటిస్తారు.
🔹డిసెంబరు 3, 4 తేదీల్లో ప్రాథమిక, సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలు స్వీకరిస్తారు.
🔹డిసెంబరు 5, 6, 7 తేదీల్లో టీచర్ల ప్రాథమిక సీనియారిటీ జాబితాలపై వచ్చిన అభ్యంతరాలను జాయింట్ కలెక్టర్ పరిశీలించి పరిష్కరిస్తారు.
🔹డిసెంబరు 8, 9, 10 తేదీల్లో ఉపాధ్యాయులకు లభించిన పాయింట్ల ఆధారంగా తుది సీనియారిటీ జాబితాను ప్రకటిస్తారు.
🔹డిసెంబరు 11 నుంచి 15వ తేదీ వరకు ఉపాధ్యాయులు తాము ఎంపిక చేసుకున్న పాఠశాలలను ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లు ఇస్తారు.
🔹డిసెంబరు 16 నుంచి 21 వరకు కేటాయించిన స్థానాలతో వెబ్సైట్లో టీచర్ల బదిలీల ఉత్తర్వులు ఉంచుతారు.
🔹డిసెంబరు 22, 23 తేదీల్లో బదిలీల ఉత్తర్వులో ఏమైనా సాంకేతిక సమస్యలు వస్తే వాటిని పరిష్కరిస్తారు.
🔹డిసెంబరు 24న ఉపాధ్యాయులు వెబ్సైట్ నుంచి బదిలీ ఉత్తర్వులు డౌన్లోడ్ చేసుకొని సంబంధిత అధికారుల అనుమతితో కొత్త పాఠశాలల్లో బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది.