న్యూఢిల్లీ, జులై 17: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో తవ్వేకొద్దీ దారుణాలు బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ముమ్మరంగా దర్యాప్తు చేపడుతోంది. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తోంది. తాజాగా మరో ఇద్దరిని సీబీఐ అరెస్ట్ చేసింది. అరెస్టైన వారిని బీహార్‌లోని పాట్నాకు చెందిన పంకజ్ కుమార్, జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన రాజు సింగ్‌గా గుర్తించారు. వీరిలో పంకజ్ కుమార్ అలియాస్ ఆదిత్య.. పరీక్ష జరగడానికి ముందు ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఉన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చెందిన ట్రంక్ పెట్టె నుంచి నీట్ క్వశ్చన్ పేపర్‌ను తస్కరించినట్లు గుర్తించారు. నీట్ పేపర్ లీక్ చేసినట్లు అనుమానిస్తున్న పంకజ్ కుమార్ ఐఐటీ జంషెడ్పుర్లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఇతడు హజారీబాగ్‌లోని ఎన్టీఏకు చెందిన ట్రంక్ పెట్టె నుంచి దొంగలించినట్లు అనుమానిస్తున్న సీబీఐ మంగళవారం అరెస్ట్ చేసింది. ప్రశ్నపత్రాన్ని లీక్ చేయడంలో ఇతడికి రాజు సింగ్ సహాయం చేసినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్న సీబీఐ విచారిస్తుంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకీ అలియాస్ రాకేష్ రంజన్‌ను ఇప్పటికే అరెస్ట్ చేయగా.. తాజా అరెస్ట్‌లతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 14 మంది నిందితులను సీబీఐ అరెస్ట్ చేసినట్లైంది. పేపర్ లీకైనట్లు భావిస్తున్న హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్‌కి చెందిన ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అంతేకాకుండా స్కూల్ పరిసరాల్లోకాలిపోయిన ప్రశ్నపత్రాలను బీహార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా నీట్-యూజీ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గత గురువారం విచారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లను సుప్రీంకోర్టు స్వీకరించింది. సదరు అఫిడవిట్లను పరిశీలించాల్సి ఉండడంతో అత్యున్నత ధర్మాసనం కేసు విచారణను జులై 18కి వాయిదా వేసింది.
ఈ ఏడాది మే 5న నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహించగా.. దేశవ్యాప్తంగా 4,570 కేంద్రాల్లో దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అయితే నీట్ ఫలితాల్లో ఏకంగా 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం, ఒకే సెంటర్లో పరీక్ష రాసిన పలువురికి ఫస్ట్ ర్యాంకులు రావడం అనుమానాలకు దారితీసింది. దీంతో దేశ వ్యాప్తంగా నిరసనలు వెళ్లువెత్తాయి.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.