Nerella Sharada: తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్‌గా నేరెళ్ల శారద బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బుద్ధ భవన్ లోని కమిషన్ కార్యాలయంలో బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మహిళా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పద్మావతి రెడ్డి, వినోద్.. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నేరెళ్ల శారద మాట్లాడుతూ.. తనపైన నమ్మకం ఉంచి మహిళా కమిషన్ చైర్మన్‌గా నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళలపైన జరుగుతున్న అకృత్యాలను నివారించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. మహిళల సంరక్షణతో పాటు పురుషులు స్త్రీలను గౌరవించే విధంగా పని చేస్తానని అన్నారు. మహిళా కమిషన్ సమీక్ష సమావేశం తరువాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.
మహిళలకు మరింత మేలు చేస్తాం: ఉత్తమ్
”రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన నేరెళ్ళ శారదకు శుభాకాంక్షలు. సుదీర్ఘ కాలం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కు సేవలు అందించారు. శారద చేసిన సేవలకు జాతీయ నాయకత్వం గుర్తించి మహిళా కమిషన్ బాధ్యతలు అప్పగించింది. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కార్పొరేషన్ చైర్మన్లు అద్భుతంగా పని చేయాలని ఆకాంక్షిస్తున్నా. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. మహిళల కోసం 5 వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం.మహిళా సంఘాల వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. మహిళా కమిషన్ ద్వారా మరింత మేలు చేస్తామ”ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.