Bank Scam : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ రుణాల పేరిట భారీ స్కామ్ కు పాల్పడినట్లు తెలిసింది. మేనేజర్ 5 కోట్ల రూపాయల రుణాలు దారి మళ్లించారని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. 42 మంది ఖాతాదారుల పేర్లపై మేనేజర్ అజయ్ 5 కోట్ల వరకు రుణాలు తీసుకున్నట్లు చెబుతున్నారు.
ముద్ర, బిజినెస్, పర్సనల్, విద్య, ఓడీ పేరిట రుణాలు తీసుకున్నారని.. ఆ రుణాలకు ఈఎంఐ చెల్లించాలని ఖాతాదారుల ఫోన్లకు సందేశాలు వచ్చాయి. దీంతో అవాక్కైన బాధితులంతా బ్యాంకుకి వెళ్లి ఆరా తీశారు. మోసపోయామని తెలుసుకుని లబోదిబోమన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు మేనేజర్ అజయ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా బ్యాంకు ఉన్నతాధికారులు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో యూనియన్ బ్యాంకు ఉంది. ఈ బ్యాంకులోని పలువురు ఖాతాదారులకు తెలియకుండా బ్యాంకు మేనేజర్ పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నారు. రుణాలకు సంబంధించి ఈఎంఐ చెల్లించాలి అంటూ ఖాతాదారులకు మేసేజ్ లు వెళ్లాయి. దీంతో వారు షాక్ కి గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు బ్యాంకుకి వెళ్లారు. నిజం తెలిసి కంగుతిన్నారు. తమకు తెలియకుండానే తమ పేరిట బ్యాంకు మేనేజర్ రుణాలు తీసుకున్నారని తెలిసి లబోదిబోమంటున్నారు.
తమకు న్యాయం చేయాలంటూ బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. 42 మంది ఖాతాదారుల పేరిట బ్యాంకు మేనేజర్ అజయ్ కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. బ్యాంకు మేనేజర్ అజయ్ తమ నుంచి చెక్కులు, బ్యాంకు ష్యూరిటీలు ఎంతో తెలివిగా కలెక్ట్ చేశారని బాధిత కస్టమర్లు వాపోయారు. వాటిని ఉపయోగించి తనకు అవసరమైన డబ్బును బ్యాంకు మేనేజర్ అజయ్ రుణాల రూపంలో తీసుకున్నారు. ఆ తర్వాత ఖాతాదారుల ఫోన్లకు సందేశాలు రావడంతో ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ప్రస్తుతం బ్యాంకు మేనేజర్ అజ్ఞాతంలో ఉన్నాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, ఇంత పెద్ద స్కామ్ జరిగినా అది బయటకు రాకుండా బ్యాంకు ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. వెంటనే మేనేజర్ అజయ్ ను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.