వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది 2-3 రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శుక్రవారం ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అలాగే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది. ప్రజలు వరద ప్రవహించే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదు. వర్షాలతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు కింద ఉండరాదని వాతావరణ శాఖ సూచించింది.
గురువారం సాయంత్రం 7 గంటల నాటికి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 137మిమీ అధిక వర్షపాతం నమోదైంది. కొయ్యలగూడెంలో 111మిమీ, కోనసీమ జిల్లా మండపేటలో 96మిమీ, తూర్పుగోదావరి జిల్లా కడియంలో 92మిమీ, నిడదవోలులో 91మిమీ వర్షపాతం పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రోణంకి కూర్మనాధ్ తెలిపారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.