కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మనసు తెలిసిన వ్యక్తిగా, ఆప్తుడిగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను పొగిడేశారు. పీకే అంటేనే దేశంలో ఒక బ్రాండ్ అని కితాబిచ్చారు.
Prashant Kishor | Congress: పీకే అంటేనే ఓ బ్రాండ్.. అందుకే ప్రధాన కార్యదర్శి హోదా!
దేశంలో విజయవంతమైన ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందిన ప్రశాంత్ కిషోర్ (పీకే) కాంగ్రెస్ లో చేరనుండటం ఖరారైందని, ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించబోతున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ లో చేరికపై కొద్ది రోజులుగా అధిష్టానంతో చర్చలు, సమాలోచనలు జరుపుతోన్న పీకేను ఉద్దేశించి అధినేత్రి సోనియా గాంధీకి అత్యంత ఆప్తుడైన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీకే ఎంట్రీకి గ్రాండ్ వెల్కమ్ చెబుతున్నట్లుగా గెహ్లాట్ చేసిన కామెంట్లు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరుతుండటంపై చాలా మంది సీనియర్లు.. ప్రధానంగా గాంధీ ఫ్యామిలీ నాయకత్వాన్ని సవాలు చేస్తోన్న జీ-23 నేతలు వ్యతిరేకిస్తున్నా, మిగతా నేతలు మాత్రం హర్షాతిరేకాలు చేస్తున్నారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్ మరో అడుగు ముందుకేసి పీకేను ఆకాశానికెత్తేశారు. సోనియా గాంధీతో సమావేశం కోసం బుధవారం ఢిల్లీ వచ్చిన రాజస్థాన్ సీఎం.. అధినేత్రి మనసు తెలిసిన వ్యక్తిగా మీడియాతో మాట్లాడుతూ పీకేను తెగపొగిడేశారు. పీకే అంటేనే దేశంలో ఒక బ్రాండ్ అని కితాబిచ్చారు.
ప్రశాంత్ కిషోర్ విషయానికొస్తే దేశంలోనే ఆయన ఓ బ్రాండ్‌గా మారిపోయాడు. వృత్తి రీత్యా అతను 2014 పార్లమెంటరీ ఎన్నికల్లో మోదీ, ఎన్డీయేతో కలిసి పనిచేశారు. ఆపై నితీశ్ కుమార్ వెంట నడిచారు. తర్వాతి కాలంలో పంజాబ్ లో కాంగ్రెస్ కు సేవలందించారు. ఇంకా పలు రాష్ట్రాల్లో భిన్న పార్టీలతో పనిచేశారు. ఎన్నికల వ్యూహకర్తలు చాలా మంది ఉన్నారు. మేం(కాంగ్రెస్) వారితోనూ టచ్ లో ఉన్నాం. అయితే పీకేకు ఉన్న గొప్ప పేరు వల్ల ప్రతిదీ వార్త అవుతుంది. ఒకరి అనుభవాన్ని వినియోగించుకోవడం అన్ని పార్టీలూ చేసే పనే. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు’అని రాజస్థాన్ కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. గెహ్లాట్, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భగేల్ తో కలిసి బుధవారం రాత్రి సోనియా గాంధీతో సమావేశం కానున్నారు. సోనియాను కలవడానికి ముందే పీకేను గెహ్లాట్ చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి.
గడిచిన నాలుగు రోజుల్లో సోనియా గాంధీతో ఏకంగా మూడు సార్లు భేటీ అయిన ప్రశాంత్ కిషోర్.. 2024 సార్వత్రిక ఎన్నికలు, త్వరలో జరగబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రోడ్ మ్యాప్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పీకే చెప్పిన సలహాలపై కమిటీని ఏర్పాటు చేసిన సోనియా.. ఆ అంశాలను మే నెలలో జైపూర్ వేదికగా జరగనున్న చింతన్ బైఠక్ లోనూ చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరాల్సిందిగా ఇప్పటికే పీకేను ఆహ్వానించిన అధిష్టానం అతనికి సముచిత పదవి ఇవ్వాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ లో చేరాక ప్రశాంత్ కిషోర్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయని, ఎన్నికల నిర్వహణ, వ్యూహరచన, పొత్తుల ఖరారు బాధ్యతలను ఆయనకు అప్పగించే అవకాశాలున్నాయని నేతలు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పునరుజ్జీవం, పీకే చేరిక, తదితర అంశాలపై సోమవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. రాహుల్, ప్రియాంక గాంధీలతోపాటు పలువురు సీనియర్లతోనూ చర్చించారు. కాంగ్రెస్ చింతన్ బైఠక్ సదస్సు మే 13 నుంచి ప్రారంభం కానుండగా, ఆ సందర్భంలోనే పీకే ఎంట్రీ గ్రాండ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.