Monday, November 25, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
AP New Cabinet : ఏపీలో కొత్త...

AP : November 2024 Session Department Tests

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నవంబర్ 2024 సెక్షన్ సెషన్ లో...

APTET July 2024 Rsults out now. Check result on this direct link

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ జులై-2024) ఫలితాలను ఈ...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

How to check School Grant balance in PFMS login

Andhra Pradesh school education department sanctioned an amount of...

AP New Cabinet : ఏపీలో కొత్త మంత్రుల కోలాహలం.. వారి శాఖలు, వ్యక్తిగత, రాజకీయ వివరాలివే!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Table of contents

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. తొలి మంత్రివర్గం మొత్తాన్ని రాజీనామా చేయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోమోహన్‌రెడ్డి సోమవారం కొత్త కేబినెట్‌ను కొలువుదీర్చారు. పాత, కొత్తల కలయికతో కొత్త మంత్రివర్గం ఏర్పడింది. 

AP New Cabinet : ఏపీలో కొత్త మంత్రుల కోలాహలం.. వారి శాఖలు, వ్యక్తిగత, రాజకీయ వివరాలివే!

11 మంది పాత మంత్రులు కొనసాగగా.. కొత్తగా 14 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న నాయకులు, వారి నేపథ్యం, రాజకీయ ప్రస్థాన వివరాలు తెలుసుకోండి.

1.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఓసీ)

70 సంవత్సరాల వయసున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఎంఏ, పీహెచ్‌డీ ఉన్నత విద్యను అభ్యసించారు. 1974లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1978లో జనతాపార్టీ అభ్యర్థిగా, 1985, 1994ల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పీలేరు నుంచి పోటీచేసి ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్‌ అభ్యర్థిగా 1989, 1999, 2004లో పీలేరు నుంచి, 2009లో పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత వైసీపీలో చేరి 2014, 2019ల్లో పుంగనూరు నుంచి విజయం సాధించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, జగన్‌ క్యాబినెట్‌లలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత కేబినెట్‌లో విద్యుత్, అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్ టెక్నాలజీ మంత్రిగా కొనసాగనున్నారు. పెద్దిరెడ్డి కుమారుడు పీవీ మిథున్‌రెడ్డి రాజంపేట ఎంపీగా, ఆయన సోదరుడు ద్వారకనాథరెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

2.బొత్స సత్యనారాయణ (బీసీ)

1978లో విద్యార్థి సంఘ నాయకుడిగా మొదలుపెట్టి అగ్ర రాజకీయ నాయకుడిగా ఎదిగిన బొత్స సత్యనారాయణ వయసు 64 సంవత్సరాలు. బీఏ విద్యనభ్యసించారు. కాంగ్రెస్‌ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగారు. 1992 నుంచి 1999 వరకు రెండుసార్లు విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఛైర్మన్‌గా పని చేశారు. 1996లో బొబ్బిలి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా, 1999లో అక్కడి నుంచే కాంగ్రెస్‌ తరఫున ఎంపీగా గెలిచారు. 2004, 2009ల్లో చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఓడిపోయి.. తర్వాత వైసీపీలో చేరి 2019లో మళ్లీ గెలిచారు. 2012 నుంచి 2015 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పీసీసీ అధ్యక్షునిగా పనిచేశారు. వైఎస్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, జగన్‌.. మొత్తం నలుగురు ముఖ్యమంత్రుల కేబినెట్‌లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుత కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

3.కళత్తూరు నారాయణస్వామి (ఎస్సీ)

1983లో కార్వేటినగరం మండలం అన్నూరు సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికై రాజకీయాల్లోకి ప్రవేశించిన నారాయణస్వామి వయసు 73 సంవత్సరాలు. బీఎస్సీ వరకు చదివారు. 2004లో సత్యవేడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి ఎన్‌.శివప్రసాద్‌పై గెలిచారు. 2009లో ఓడిపోయారు. తర్వాత వైసీపీలో చేరి 2014, 2019ల్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీలతో విజయభేరి మోగించారు. జగన్‌ తొలి మంత్రివర్గంలో మొదటిసారి మంత్రిగా చోటు దక్కించుకున్నారు. తాజాగా మళ్లీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొనసాగింపు దక్కింది.

4.ధర్మాన ప్రసాదరావు (బీసీ)

విద్యార్థి దశలోనే కాంగ్రెస్‌ పార్టీ పట్ల ఆకర్షితులైన ధర్మాన ప్రసాదరావు వయసు 65 సంవత్సరాలు. ఇంటర్మీడియట్ వరకు చదివారు. 1983లో స్వగ్రామమైన మబుగాం పంచాయతీ సర్పంచిగా ఎన్నికయ్యారు. 1989లో నరసన్నపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. 1991-94 కాలంలో చేనేత, జౌళిశాఖ, జలవనరులు, పోర్టులశాఖ మంత్రిగా చేశారు. 1999, 2004, 2009లో హ్యాట్రిక్‌ విజయాలతో రెవెన్యూ వంటి కీలక మంత్రి పదవులూ దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా, 2019లో మళ్లీ విజయం సాధించారు. ప్రస్తుత కేబినెట్‌లో మరోసారి రెవెన్యూ శాఖ మంత్రిగా చక్రం తిప్పనున్నారు.

5.బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (ఓసీ)

సీఎం జగన్ మొదటి కేబినెట్‌లో ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. రెండో మంత్రివర్గంలోనే అదే శాఖలో కొనసాగనున్నారు. 52 సంవత్సరాల వయసున్న బుగ్గన.. బీటెక్‌ చదివారు. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తాత బీవీ శేషారెడ్డి 1955లో డోన్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు. తండ్రి రామనాథరెడ్డి గంథ్రాలయ సంస్థ ఛైర్మన్‌గా, ఒక పర్యాయం సర్పంచ్‌గా పనిచేశారు. బుగ్గన 1995 నుంచి 2006 వరకు రెండు సార్లు సర్పంచ్‌గా ఉన్నారు. తొలుత టీడీపీలో ఉన్న బుగ్గన.. దివంగత వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్‌లో, తర్వాత వైసీపీలో చేరారు. 2014లో తొలిసారి డోన్‌ ఎమ్మెల్యేగా గెలిచి, అసెంబ్లీలో పీఏసీ చైర్మన్‌గా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో రెండోసారి గెలిచి జగన్‌ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. తాజాగా మరోమారు అవకాశం దక్కింది.

6.పినిపే విశ్వరూప్‌ (ఎస్సీ)

1987లో కాంగ్రెస్‌లో చేరి రాజకీయాల్లోకి వచ్చిన పినెపే విశ్వరూప్ వయసు 60 సంవత్సరాలు. బీఎస్సీ, బీఈడీ చదివారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నుంచి 1998 ఉప ఎన్నికలో, 1999 సాధారణ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 2004లో ముమ్మిడివరం నుంచి, 2009లో అమలాపురం నుంచి గెలుపొందారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. 2013లో వైసీపీలో చేరి.. 2014 ఎన్నికల్లో అమలాపురం ఎంపీగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అమలాపురం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జగన్ మొదటి మంత్రివర్గంలో పని చేసిన విశ్వరూప్.. రెండో కేబినెట్‌లో పదవి నిలబెట్టుకుని రవాణా శాఖ మంత్రిగా కొనసాగనున్నారు.

7.ఆదిమూలపు సురేష్‌ (ఎస్సీ)

రైల్వేలో డిప్యూటీ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌గా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఆదిమూలపు సురేష్ వయసు 58 సంవత్సరాలు.. ఎంటెక్‌, పీహెచ్‌డీ చదివారు. 2009లో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో సంతనూతలపాడు నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలిచారు. 2019లో మళ్లీ యర్రగొండపాలెం నుంచి వైసీపీ తరఫున విజయం సాధించి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రికి విశ్వాసపాత్రుడిగా పేరుండటంతో మళ్లీ కేబినెట్‌లో మున్సిపల్ శాఖ మంత్రిగా చోటు దక్కింది.

8.షేక్‌ బేపారి అంజాద్‌ బాషా (మైనార్టీ)

2005లో కడప నగరపాలక సంస్థకు జరిగిన మొదటి ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలుపొందిన అంజాద్ బాషా వయసు 50 సంవత్సరాలు.. డిగ్రీ మధ్యలో చదువు మానేశారు. దివంగత వైఎస్సార్ మరణానంతరం రాజకీయ పరిణామాల్లో వైఎస్‌ కుటుంబానికి నమ్మకమైన మైనార్టీ నాయకుడిగా మారారు. 2014లో వైసీపీ తరఫున కడప ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై జగన్‌ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. తాజా మంత్రివర్గంలో సైతం డిప్యూటీ సీఎం, మైనార్టీ శాఖ మంత్రిగా కొనసాగనున్నారు. అంజాద్‌బాషా తాత, పెదనాన్న కడప జిల్లా సిద్దవటం సర్పంచులుగా సుదీర్ఘకాలం పనిచేశారు. చిన్నాన్న నబీసాహెబ్‌ 1967లో కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యేగా గెలుపొందారు.

9.తానేటి వనిత (ఎస్సీ)

గోపాలపురం ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి రెండుసార్లు గెలిచిన జొన్నకూటి బాబాజీరావు కుమార్తెగా రాజకీయ వారసత్వాన్ని అందుకున్న తానేటి వనిత వయసు 49 సంవత్సరాలు. ఎమ్మెస్సీ జువాలజీ చదివారు. టీడీపీ నుంచే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2013లో వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఓడినా 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనితపై భారీ మెజార్టీతో గెలిచారు. జగన్ తొలి మంత్రివర్గంలో మహిళాభివృద్ధి- శిశు సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత కేబినెట్‌లో హోం మంత్రిగా కీలక పదవి అధిరోహించారు.

10.సీదిరి అప్పలరాజు (బీసీ)

ఉన్నత విద్యావంతుడైన సీదిరి అప్పల రాజు వయసు 42 సంవత్సరాలు. ఎంబీబీఎస్‌ చదివారు. కుటుంబానికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. 2017లో జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషపై విజయం సాధించారు. మత్స్యకార వర్గానికి చెందిన ఈయనను జగన్‌ 2020 జులైలో తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఇప్పుడు మరోసారి మంత్రిగా కొనసాగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు.

11.చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ (బీసీ)

కాంగ్రెస్‌ పార్టీ నుంచి 2001 నుంచి 2006 వరకు రాజోలు జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన గెల్లుబోయిన వేణు వయసు 60 సంవత్సరాలు. బీఎస్సీ వరకు చదివారు. జెడ్పీటీసీ సభ్యుడిగా చేసిన తర్వాత ఐదేళ్లు తూర్పు గోదావరి జిల్లా పరిషత్తు అధ్యక్షుడిగా వ్యవహరించారు. తర్వాత వైసీపీలో చేరారు. 2014లో కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2019లో రామచంద్రాపురం నుంచి టీడీపీ అభ్యర్థిపై గెలుపొందారు. 2020 జులైలో తొలిసారిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా, మంత్రివర్గ విస్తరణలో సైతం అదేశాఖలో కొనసాగనున్నారు.

12.అంబటి రాంబాబు (కాపు)

కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన అంబటి రాంబాబు వయసు 65 ఏళ్లు.. బీఏ, బీఎల్‌ విద్యనభ్యసించారు. 1988లో కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా లీగల్‌సెల్‌ కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. 1989లో రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 1999ల్లో రెండుసార్లు ఓటమిపాలయ్యారు. 1991 నుంచి 1994 వరకు నెడ్‌క్యాప్‌ చైర్మన్‌గా, 2005 నుంచి 2007 వరకు ఏపీఐఐసీ చైర్మన్‌గా పనిచేశారు. వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 2014లో సత్తెనపల్లి నుంచి ఓడిపోయినా గత ఎన్నికల్లో అక్కడి నుంచే గెలిచారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా విపక్షాలపై విరుచుకుపడటంలో ముందుంటారు. జగన్ కేబినెట్‌లో నీటిపారుదల శాఖ మంత్రిగా కొనసాగనున్నారు.

13.విడదల రజిని (బీసీ)

కేవలం 32 ఏళ్లకే విడదల రజినిని మంత్రి పదవి వరించింది. ఉస్మానియా వర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్‌ సైన్సు, హైదరాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. రజిని మామ విడదల లక్ష్మీనారాయణ చిలకలూరిపేట మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా పని చేశారు. విడదల రజిని 2018లో టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. అక్కడ సీనియర్‌ వైసీపీ నాయకుడు మర్రి రాజశేఖర్‌ను కాదని 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌ దక్కించుకుని.. అప్పటి మంత్రి పత్తిపాటి పుల్లారావుపై గెలిచారు. ప్రస్తుత కేబినెట్‌లో వైద్య శాఖ మంత్రిగా కీలక పదవి దక్కించుకున్నారు.

14.ఆర్కే రోజా (ఓసీ)

మంత్రి రోజా వయసు 51 సంవత్సరాలు. బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతుండగా మానేసి సినీరంగ ప్రవేశం చేశారు. 1999లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2004, 2009 ఎన్నికల్లో నగరి, చంద్రగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వైసీపీలో చేరి, నగరి నియోజకవర్గం నుంచి 2014, 2019లో రెండుసార్లు గెలుపొందారు. 2019 జులై నుంచి రెండేళ్లపాటు ఏపీఐఐసీ ఛైర్మన్‌గా పనిచేశారు. తాజా మంత్రివర్గంలో టూరిజం , సాంస్కృతిక, యువజన సర్వీసులు మంత్రిగా కొనసాగనున్నారు.

15.మేరుగ నాగార్జున (ఎస్సీ)

విశాఖపట్నంలోని ఆంధ్రా వర్సిటీలో ఫ్రొఫెసర్‌గా పనిచేస్తూ రాజకీయ అరంగేట్రం చేసిన మేరుగ నాగార్జున వయసు 58 సంవత్సరాలు. ఎంకాం, ఎంఫిల్‌, పీహెచ్‌డీ ఉన్నత విద్యను అభ్యసించారు. 2009లో వేమూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వైసీపీలో చేరి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయి.. 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. తాజా కేబినెట్‌లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సేవలందించనున్నారు.

16.పీడిక రాజన్నదొర (ఎస్టీ)

ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన రాజన్న దొర వయసు 58 ఏళ్లు. ఎంఏ వరకు చదివారు. 2004లో జీసీసీ సీనియర్‌ మేనేజర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఓడినా.. టీడీపీ అభ్యర్థి కుల వివాదం నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో అనూహ్యంగా ఎమ్మెల్యే అయ్యారు. 2009లో కాంగ్రెస్‌ నుంచి, 2014, 19ల్లో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తాజా, కేబినెట్‌లో డిప్యూటీ సీఎం పదవితో పాటు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

17.కేవీ ఉషశ్రీచరణ్‌ (బీసీ)

కర్ణాటకకు చెందిన ఉషశ్రీ అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో స్థిరపడ్డారు. 46 సంవత్సరాల వయస్సున్న ఉషశ్రీ.. ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉన్నత విద్యనభ్యసించారు. 2012లో టీడీపీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2013లో వైసీపీలో చేరి, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసి గెలుపొందారు. తాజా కేబినెట్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

18.కొట్టు సత్యనారాయణ (ఓసీ)

1994లో తొలిసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కొట్టు సత్యనారాయణ వయసు 67 సంవత్సరాలు. ఇంటర్మీడియట్‌ వరకు చదివారు. 1999లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా.. 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీలో చేరినా సీటు రాకపోవడంతో వెంటనే పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీలో చేరి, 2019లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుత కేబినెట్‌లో దేవాదాయ శాఖ మంత్రిగా కీలక పదవి దక్కింది.

19.కాకాణి గోవర్ధన్‌రెడ్డి (ఓసీ)

రాజకీయ కుటుంబం నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డి వయస్సు 58 ఏళ్లు. ఎంఏ, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యనభ్యసించారు. తండ్రి దివంగత కాకాణి రమణారెడ్డి 18 ఏళ్లు పొదలకూరు సమితి అధ్యక్షుడిగా, తల్లి లక్ష్మీకాంతమ్మ తోడేరు సర్పంచిగా 25 ఏళ్లు కొనసాగారు. 2006లో నెల్లూరు జడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తర్వాత వైసీపీలో చేరి 2014, 2019ల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుత కేబినెట్‌లో వ్యవసాయం, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

20.కారుమూరి వెంకట నాగేశ్వరరావు (బీసీ)

2004లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి ద్వారకాతిరుమల జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ పదవి చేపట్టిన కారుమూరి నాగేశ్వరరావు వయసు 57 సంవత్సరాలు. పదో తరగతి వరకు చదివారు. 2009లో తణుకు ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ తరఫున గెలిచారు. 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరి దెందులూరులో పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మళ్లీ తణుకు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుత కేబినెట్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

21.జోగి రమేష్‌ (బీసీ)

కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జోగి రమేష్ వయసు 52 సంవత్సరాలు. బీఎస్సీ వరకు చదివారు. 2009లో తొలిసారిగా పెడన నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలిచారు. 2014లో మైలవరం నుంచి వైసీపీ టికెట్‌పై పోటీచేసి పరాజయం పాలయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున పెడన నుంచి పోటీ చేసి మళ్లీ విజయం సాధించారు. ప్రస్తుత కేబినెట్లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.

22.గుడివాడ అమర్‌నాథ్‌ (ఓసీ)

ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన గుడివాడ గురునాథరావు కుమారుడిగా ఆయన నుంచి రాజకీయ వారసత్వాన్నీ అందిపుచ్చుకున్నారు. 21 ఏళ్ల వయసులోనే 2007లో టీడీపీ నుంచి విశాఖ జీవీఎంసీ కార్పొరేటర్‌గా విజయం సాధించారు. 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. అనకాపల్లి ఎంపీగా పోటీచేసి టీడీపీ ఎంపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి విశాఖపట్నం నగర, గ్రామీణ వైకాపా జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2019లో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల వైసీపీ జిల్లా అధ్యక్షుడిగానూ బాధ్యతలు స్వీకరించారు. 37 సంవత్సరాల వయసున్న అమర్‌నాథ్.. బీటెక్‌ వరకు చదివారు. ప్రస్తుత కేబినెట్లో ఐటీ, పారిశ్రామిక, వాణిజ్య పన్నులు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

23.గుమ్మనూరు జయరాం (బీసీ)

2005లో చిప్పగిరి నుంచి తెలుగు దేశం పార్టీ తరఫున జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచిన గుమ్మనూరు జయరాం వయసు 54 సంవత్సరాలు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకు చదివారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2011లో వైసీపీలో చేరారు. 2014, 2019ల్లో ఆలూరు నుంచి రెండుసార్లు వైసీపీ అభ్యర్థిగా గెలుపొందారు. జగన్‌ కేబినెట్‌లో కార్మిక, ఉపాధి శిక్షణ మంత్రిగా పని చేశారు. ఇప్పుడు మరోసారి అదే పదవి దక్కింది.

24.దాడిశెట్టి రాజా (ఓసీ)

2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేసిన దాడిశెట్టి రాజా వయసు: 45 సంవత్సరాలు. బీఏ వరకు చదివారు. 2010లో వైసీపీలో చేరారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున తూర్పు గోదావరి జిల్లా తునిలో పోటీచేసి.. రెండుసార్లు విజయం సాధించారు. తాజా మంత్రి వర్గంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

25.బూడి ముత్యాలనాయుడు (బీసీ)

1991లో రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ప్రచారదళ్‌ కన్వీనరుగా ఎన్నికైన బూడి ముత్యాల నాయుడు వయసు 60 సంవత్సరాలు. విఇంటర్మీడియట్‌ వరకు చదివారు. వార్డు సభ్యుడి స్థాయి నుంచి రాజకీయాల్లో మంత్రి వరకు ఎదిగారు. 1988 నుంచి 1991 వరకు తారువ వార్డు సభ్యుడిగా, గ్రామ ఉప సర్పంచిగా, తర్వాత సర్పంచిగా, ఎంపీటీసీ సభ్యుడిగా, ఎంపీపీగా, జడ్పీటీసీగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మాడుగుల నుంచి గెలిచి, శాసనసభలో ప్రతిపక్ష ఉపనాయకుడిగా వ్యవహరించారు. 2019లో రెండోసారి గెలిచి, ప్రభుత్వ విప్‌ పదవి చేపట్టారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పదవి దక్కించుకున్నారు.

ap new cabinet : ఏపీలో కొత్త మంత్రుల కోలాహలం.. వారి శాఖలు, వ్యక్తిగత, రాజకీయ వివరాలివే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this